గ్యాస్ పరిశ్రమలో భారీ పేలుడు.. 200 మీటర్ల దూరంలో ఎగిరిపడి.. ఛిద్రమైన కార్మికుడు!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని గ్యాస్ పరిశ్రమలో సిలిండర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతదేహం 200 మీటర్ల దూరం ఎగిరిపడింది. గడువు ముగిసిన సిలిండర్లలో గ్యాస్ నింపుతుండగా ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

గ్యాస్ పరిశ్రమలో భారీ పేలుడు.. 200 మీటర్ల దూరంలో ఎగిరిపడి.. ఛిద్రమైన కార్మికుడు!
Yadadri Gas Explosion

Updated on: Oct 16, 2026 | 5:18 PM

యాదాద్రి భువనగిరి: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులోని ఆక్సి-నౌ గ్యాస్ పరిశ్రమలో సిలిండర్ పేలడంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పారిశ్రామిక పార్కు పరిసర ప్రాంతాల్లోని కార్మికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

సిలిండర్ పేలడంతో కార్మికుడి మృతి

పరిశ్రమలో సిలిండర్లలో ఆక్సిజన్ నింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు తీవ్రతకు అతడి మృతదేహం ఛిద్రమై, సుమారు 200 మీటర్ల దూరంలోని పక్క పరిశ్రమలో పడినట్లు సమాచారం. ఈ దృశ్యంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గడువు ముగిసిన సిలిండర్లలో గ్యాస్ నింపుతుండగా ఒత్తిడిని తట్టుకోలేక పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

సమాచారం అందుకున్న చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? గడువు ముగిసిన సిలిండర్లను వినియోగించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో పారిశ్రామిక ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us