Telugu: మృత్యువు అంచుల్లో.. దుర్గమ్మ స్టాండ్‌తో పునర్జన్మ!

హల్దీ వాగులో దూకిన మహిళకు దుర్గామాత విగ్రహం స్టాండ్‌ ప్రాణాధారంగా మారింది. నీటిలో మునిగిపోతున్న సమయంలో స్టాండ్‌ను పట్టుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సమాచారంతో స్పందించిన కానిస్టేబుల్‌ విష్ణు ఆమెను సురక్షితంగా రక్షించారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ..

Telugu: మృత్యువు అంచుల్లో.. దుర్గమ్మ స్టాండ్‌తో పునర్జన్మ!
Balamani

Updated on: Oct 23, 2026 | 7:14 AM

జీవితంపై విరక్తితో హల్దీ వాగులోకి దూకిన ఓ మహిళను అనూహ్య పరిణామం మృత్యువు నుంచి కాపాడింది. అప్పటికే నిమజ్జనం చేసిన దుర్గామాత విగ్రహం స్టాండ్‌ ఆమెకు ఆధారంగా మారింది. నీటిలో మునిగిపోతున్న సమయంలో ఆ స్టాండ్‌ చేతికి తగలడంతో దానిని గట్టిగా పట్టుకుని ప్రాణాలతో బయటపడింది. స్థానికులు, పోలీసుల సమయస్ఫూర్తితో ఆమెకు పునర్జన్మ లభించింది.

ఏం జరిగిందంటే?

సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంగుట్ట సమీపంలోని హల్దీ వాగు చెక్‌డ్యామ్‌ వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన చీర్ల బాలమణి (50) మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె వాగు నీటిలోకి దూకింది. నీటిలో మునిగిపోతున్న సమయంలో అనుకోకుండా ఆమె చేతికి దుర్గామాత విగ్రహం స్టాండ్‌ తగిలింది. వెంటనే దానిని పట్టుకోవడంతో నీటిపై తేలియాడుతూ ఉండిపోయింది.

సమయానికి స్పందించి.. ప్రాణాలు కాపాడి!

వాగులో తేలియాడుతున్న మహిళను కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు వెంటనే చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ విష్ణుకు సమాచారం అందించారు. దీంతో ఆయన స్థానికులతో కలిసి స్పందించి బాలమణిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం సమాచారం అందుకున్న ఆమె కుమారుడు, అల్లుడు అక్కడికి చేరుకుని బాలమణిని ఇంటికి తీసుకెళ్లారు.

సరైన సమయంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్‌ విష్ణును స్థానికులు అభినందించారు. అనూహ్యంగా చేతికి అందిన స్టాండ్‌, సకాలంలో స్పందించిన స్థానికులు, పోలీసుల చొరవతో ఓ నిండు ప్రాణం నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us