
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ తండా ప్రభుత్వ పాఠశాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల సాయంత్రం విరామ సమయంలో విద్యార్థులు ఆడుకుంటూ అడవి ఆముదం కాయలు తినడంతో పది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విరామ సమయంలో ఓ బాలిక పాఠశాల ఆవరణ బయటకు వెళ్లి అడవి ఆముదం కాయలను తీసుకువచ్చి, అవి బాదం కాయలని చెప్పి తోటి విద్యార్థులకు పంచిపెట్టినట్లు తెలుస్తోంది. వాటిని తిన్న కొద్దిసేపటికే విద్యార్థులందరికీ కడుపునొప్పి, వాంతులు మొదలవడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై వారిని హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో వైద్యులు విద్యార్థులందరికీ తక్షణమే ప్రథమ చికిత్స అందించారు. అయితే, వీరిలో రెండో తరగతి చదువుతున్న భావన అనే విద్యార్థినికి వాంతులు, విరేచనాలు ఎక్కువై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్యం కోసం ఆమెను హుటాహుటిన వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం పరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన తొమ్మిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా వారందరినీ 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలైన మూత్రశాలలు లేకపోవడం వల్లే పిల్లలు విరామ సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తోందని, అందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పరిగి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) అంజయ్య ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.