
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నషా ముక్త్ భారత్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఉద్యమంలో యువతను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు సినీ, క్రీడా, వివిధ రంగాల ప్రముఖుల మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ను కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభాస్‌తో సమావేశమైన కిషన్ రెడ్డి.. దేశంలో మాదకద్రవ్యాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్ పేరుతో చేపట్టబోయే పాదయాత్ర వివరాలను పంచుకున్నారు. ఈ నెల 25న జరిగే ఈ పాదయాత్రలో పాల్గొని యువతకు స్ఫూర్తినివ్వాలని ప్రభాస్‌ను ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ కలిసి నషా ముక్త్ భారత్ లోగోతో కూడిన ప్రత్యేక టీ-షర్ట్‌ను ఆవిష్కరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారానికి ప్రభాస్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు.
మరోవైపు నషా ముక్త్ భారత్ కోసం పనిచేద్దాం అనే నినాదంతో కిషన్ రెడ్డి ఇటీవల ఒక మెగా సదస్సును కూడా నిర్వహించారు. ఈ వేదికపై పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. నేటి యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, శక్తివంతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
యువతలో చైతన్యం నింపేందుకు కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్ పేరిట ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు నగరంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. అంబర్‌పేట నుంచి ప్రారంభమై జూబ్లీహిల్స్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.