తెలంగాణ గ్రామీణ ప్రజలకు గుడ్‌న్యూస్.. 2 లక్షల ఇళ్లకు కేంద్రం ఆమోదం.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పథకం అమలుకు ఏర్పడిన అడ్డంకులు, సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో ఇళ్ల కేటాయింపు సాధించిన తీరును వివరించారు.

తెలంగాణ గ్రామీణ ప్రజలకు గుడ్‌న్యూస్.. 2 లక్షల ఇళ్లకు కేంద్రం ఆమోదం.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
Kishan Reddy

Updated on: Sep 18, 2026 | 8:22 PM

తెలంగాణలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఈ ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు.

తెలంగాణ గ్రామీణ ప్రజలకు 2 లక్షల ఇళ్లు

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2,00,000 ఇళ్ల లక్ష్యాన్ని ఆమోదించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు.

గత ప్రభుత్వ నిర్ణయంతో పథకానికి దూరమైన తెలంగాణ

తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో నిర్వహించిన పీఎంఏవై–జీ ఆవాస్ సర్వేలో పాల్గొనకపోవడం వల్ల రాష్ట్రంలో ఈ పథకం అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి తన సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు. దీంతో ఇతర రాష్ట్రాల మాదిరిగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తెలంగాణకు అందుబాటులో లేకుండా పోయిందని వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.. కేంద్రంతో వరుస చర్చలు

2024 ఆగస్టులో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. తన లేఖకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం ఆవాస్ సర్వేలో పాల్గొనకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితిని ప్రస్తావిస్తూ, తెలంగాణకు ఇళ్ల మంజూరులో సహకరించాలని కోరారని మంత్రి పేర్కొన్నారు.

ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమన్వయం చేసుకుని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల కేటాయింపుపై చర్చలు జరిపినట్లు తెలిపారు. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, పలుమార్లు నిర్వహించిన సమావేశాల ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇళ్ల మంజూరును సాధించగలిగామని వివరించారు.

‘అందరికీ ఇళ్లు’ లక్ష్యానికి మరో అడుగు

తెలంగాణ ప్రజలకు ఇళ్ల కేటాయింపులో సహకరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరికీ సొంతింటి సౌకర్యం కల్పించాలనే ‘హౌసింగ్ ఫర్ ఆల్’ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఈ నిర్ణయం కీలక అడుగు అని పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us