
అంజన్న అంటేనే భక్తులకు కొండంత అండ. ఆపదలో ఉన్నవారికి అభయమిచ్చే దైవం. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు. అలాంటి ఆంజనేయస్వామి కొలువైన ఎన్నో పుణ్యక్షేత్రాల్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టి మండలంలోని టోంకినీ శ్రీ సిద్ధి హనుమాన్ ఆలయం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వార్ధా నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. ఆలయ ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనాలు, నిర్మాణంలో ప్రత్యేకతలు, స్వామివారిపై భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాలు ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఏటా జరిగే మహా పాదయాత్రకు తెలంగాణ, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా తెల్లవారుజామున రెండు గంటల నుంచే బెజ్జూర్, చింతలమానేపల్లి తదితర మండలాల మారుమూల గ్రామాల నుంచి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు.
టోంకినీ సిద్ధి హనుమాన్ ఆలయ ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. సుమారు వందేళ్ల క్రితం లోన్వెల్లి గ్రామానికి చెందిన జెఠ్మల్ సోనీ అనే భక్తుడి కలలో ఆంజనేయస్వామి కనిపించారట. తాను వార్ధా నది ఒడ్డున ఉన్నానని, తనను టోంకినీ గ్రామానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించాలని సూచించారట. దీంతో స్వామివారి ఆదేశంగా భావించిన జెఠ్మల్ సోనీ వార్ధా నదిలో వెతకగా ఆంజనేయస్వామి విగ్రహం లభించిందని స్థానిక కథనం. అనంతరం ఆ విగ్రహాన్ని టోంకినీ గ్రామానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడంతో ఈ పుణ్యక్షేత్రం ఆవిర్భవించిందని భక్తులు విశ్వసిస్తారు.
సాధారణంగా ఆలయాల ముఖద్వారాలు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండటం చూస్తుంటాం. కానీ టోంకినీ సిద్ధి హనుమాన్ ఆలయంలో మాత్రం భిన్నమైన నిర్మాణ ప్రత్యేకత కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం పడమర వైపు ఉండగా.. గర్భాలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం దక్షిణాభిముఖంగా కొలువై ఉంటుంది. అందుకే భక్తులు స్వామివారిని దక్షిణ ముఖ ఆంజనేయుడిగా ఆరాధిస్తారు. మరో విశేషం ఏమిటంటే.. ఆలయానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో వార్ధా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఈ ప్రత్యేకత కూడా క్షేత్రానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
టోంకినీ సిద్ధి హనుమాన్ ఆలయంలో మరో ఆసక్తికరమైన విశేషం ఉంది. ఇక్కడి ఆంజనేయస్వామి విగ్రహం పరిమాణం ప్రతి సంవత్సరం కొంతకొంత పెరుగుతోందని భక్తులు బలంగా నమ్ముతారు. దీనిని స్వామివారి మహిమగా భావిస్తారు. అంతేకాదు.. స్వామివారికి ముడుపు కట్టి మొక్కుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు తొలగాలని స్వామివారిని వేడుకుంటూ ముడుపులు కడుతుంటారు. ఈ కారణంగానే ఈ ఆలయం ‘ముడుపుల హనుమాన్ ఆలయం’గా కూడా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికరమైన పురాణ గాథ ప్రచారంలో ఉంది. రామాయణ కాలంలో రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత ఆమె జాడ కోసం హనుమంతుడు అన్వేషణ సాగించారట. అలా వెతుకుతూ అలసిపోయి వార్ధా నది ఒడ్డున కొద్దిసేపు సేదతీరారని స్థానికంగా చెప్పుకుంటారు. ఆ సమయంలో అటుగా వచ్చిన కొండజాతి ప్రజలు హనుమంతుడికి పండ్లు సమర్పించారట. అయితే సీతమ్మ జాడను రాములవారికి తెలియజేసే వరకు ఆహారం తీసుకోనని హనుమంతుడు చెప్పారట. తనపై వారు చూపిన ప్రేమాభిమానాలకు మెచ్చి.. అక్కడే కొలువై వారి కష్టాలను తీరుస్తానని వరమిచ్చారని కథనం. అనంతరం ఆ ప్రాంతంలోనే స్వామివారు విగ్రహ రూపంలో వెలిశారని భక్తులు విశ్వసిస్తారు.
టోంకినీ గ్రామానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విశ్వాసం ఉంది. గతంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వార్ధా నది వరదలతో గ్రామం ముంపునకు గురయ్యేదని స్థానికులు చెబుతారు. అయితే ఆలయం నిర్మించిన తర్వాత భారీ వర్షాలు, వరదలు వచ్చినా గ్రామం మునగడం లేదని వారి నమ్మకం. వరద నీరు ఆలయ మెట్ల వరకు వచ్చి ఆగిపోతుందని గ్రామస్తులు చెబుతుంటారు. ఈ పరిణామాన్ని స్వామివారి మహిమగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
టోంకినీ సిద్ధి హనుమాన్ ఆలయానికి మహా పాదయాత్ర మరో ప్రధాన ఆకర్షణ. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత వచ్చే రెండో మంగళవారం ఈ యాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2001లో ఓం ప్రకాష్ తివారీ అనే భక్తుడు ఆలయ కమిటీ సహకారంతో తొలిసారిగా సుమారు 20 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అప్పట్లో కొద్దిమందితో ప్రారంభమైన ఈ యాత్ర.. క్రమంగా భారీ భక్తి జనసందోహంగా మారింది. ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు 35 వేల నుంచి 40 వేల మంది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నట్లు అంచనా. తెల్లవారుజామునే భక్తులు స్వామివారి నామస్మరణతో అడుగులు వేస్తూ ఆలయానికి చేరుకుంటారు.
మహా పాదయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పాదయాత్ర మార్గంలో పండ్లు, ఫలహారాలు, మజ్జిగ, తాగునీరు, పులిహోర పంపిణీ చేస్తూ భక్తులకు అండగా నిలుస్తున్నాయి. మరోవైపు భారీగా భక్తులు తరలివస్తుండటంతో పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. కాగజ్నగర్ డీఎస్పీ, కౌటాల సీఐ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు.
టోంకినీ సిద్ధి హనుమాన్ ఆలయం కేవలం స్థానిక భక్తులకే పరిమితమైన క్షేత్రం కాదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, మాలధారణ వంటి పర్వదినాలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఒకవైపు వందేళ్లకు పైగా చరిత్రగా ప్రచారంలో ఉన్న ఆలయ విశేషాలు.. మరోవైపు తరతరాలుగా వస్తున్న భక్తుల విశ్వాసాలు.. ఇంకోవైపు వేలాదిమందిని ఒక్కచోట చేర్చుతున్న మహా పాదయాత్ర.. ఇలా టోంకినీ సిద్ధి హనుమాన్ క్షేత్రం భక్తి, ఆధ్యాత్మికత, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది. అందుకే దీపావళి తర్వాత రెండో మంగళవారం వచ్చిందంటే చాలు.. టోంకినీ దారులన్నీ హనుమాన్ నామస్మరణతో మార్మోగిపోతాయి.