TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రభుత్వం బిగ్ అప్డేట్..

తమ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సులను భారీగా తీసుకురానుంది. ఏకంగా 2,200 కొత్త బస్సులు త్వరలో రానున్నాయి. వీటికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా కొత్త బస్సులు రానున్నాయన్నారు.

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త..  కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రభుత్వం బిగ్ అప్డేట్..
Tgsrtc Buses

Updated on: Oct 24, 2026 | 5:57 PM

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త తెలిపారు. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.  పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, ఇవి అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సిటీ బస్ టర్మినల్ నిర్మాణ పనులకు పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పీర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంత ప్రజల ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక సహకారంతో ఈ బస్ టర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. స్థానిక ప్రాంత పేరు ప్రతిబింబించేలా ఈ కొత్త బస్ స్టేషన్‌కు నామకరణం చేస్తామని, 100 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ సుమారు 1,053 బస్సు ట్రిప్పుల ద్వారా లక్ష మంది ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 367 కోట్ల మంది మహిళలు ప్రయాణించి రూ.12,888 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే 3,000 పైగా నూతన బస్సులను కొనుగోలు చేశామని, పీఎం ఈ-డ్రైవ్ కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని వెల్లడించారు. ఢిల్లీ తరహా కాలుష్యం హైదరాబాద్‌లో రాకుండా ఉండేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, తొలి దశలో 250 పాత డీజిల్ బస్సులను రిట్రోఫిట్ చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు. అలాగే దశాబ్ద కాలం తర్వాత ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించామని, గుర్తింపు సంఘంతో కమిటీ వేసి విలీన ప్రక్రియ ముందుకు తీసుకెళ్తామని వివరించారు.

అటు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూజజ ఈ నూతన టర్మినల్ పూర్తిగా సిటీ బస్సు సేవలకు మాత్రమే కేటాయించబడుతుందని తెలిపారు. యాదగిరిగుట్ట, వరంగల్, ఉమ్మడి నల్గొండ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే జిల్లా సర్వీసులు యథావిధిగా ఉప్పల్ పాత బస్ స్టాండ్ టర్మినల్ నుంచే నడుస్తాయని స్పష్టం చేశారు. ఈ టర్మినల్ ప్రాంగణంలోనే ప్రత్యేక బస్ పాస్ కౌంటర్, నిరంతర సమాచారం అందించే విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉప్పల్ ప్రధాన రహదారిపైనే బస్సులను నిలపడం వల్ల ఏర్పడే తీవ్ర ట్రాఫిక్ జామ్‌లకు ఈ టర్మినల్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. బస్సులన్నింటినీ టర్మినల్ లోపలికి మళ్లించడం వల్ల ఉప్పల్ రింగ్ రోడ్డు, చౌరస్తాలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రజలకు సికింద్రాబాద్, మెహదీపట్నం, ఐటీ కారిడార్, పటాన్‌చెరు వంటి ప్రాంతాలకు ప్రయాణం ఇకపై సులభతరం కానుందని వివరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us