
మీరు వీకెండ్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? ప్రకృతి ఒడిలో కాసేపు ఆధ్యాత్మికంగా గడపడంతో పాటు తెలంగాణ సంస్కృతిని, చేనేత కళా వైభవాన్ని కళ్లారా చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనంతో పాటు చరిత్ర, సంస్కృతి, హస్త కళలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఒకే రోజులో చూపించే వినూత్న టూరిజం ప్యాకేజీని తెలంగాణ టూరిజం శ్రీకారం చుట్టింది. ఆ స్పెషల్ టూర్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న యాదాద్రి జిల్లాలోని పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమైన ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా తెలంగాణ టూరిజంశాఖ భక్తులు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ ని తీసుకువచ్చింది. ఇప్పటివరకు యాదాద్రికి వచ్చిన భక్తులు దర్శనం ముగిసిన వెంటనే వెనుదిరిగే వారు. ఇప్పుడు భక్తులు వారసత్వ ప్రదేశాలపై ఆసక్తి కలిగిన పర్యాటకులు అదే ప్రయాణంలో చారిత్రక కోటలు, పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక చారిత్రక, చేనేత వైభవాన్ని ప్రతిబింబించే ప్రాంతాలను ఒక్కరోజులో ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.
ఒకరోజు పోచంపల్లి పేరుతో నూతనంగా ఒకరోజు పుణ్యక్షేత్ర- వారసత్వ పర్యాటక ప్యాకేజీని తెలంగాణ పర్యాటకశాఖ ప్రారంభించింది. ఈ ప్రాంతాలను ఒకే ట్రిప్‌లో సందర్శించేలా ప్రణాళిక రూపొందించింది. ఒక రోజు టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమై హైదరాబాద్‌తో ముగుస్తుంది. ‘ఒకరోజు పోచంపల్లిలో…’ పేరిట నేటి నుంచే ప్రత్యేక పర్యాటక యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర ప్రతి శని, ఆదివారాలు పర్యాటకులు ఈ టూర్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ ప్యాకేజీలో ఏసీ బస్సులో ప్రయాణం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఆలయ దర్శనం, ఎంట్రీ టిక్కెట్లు, నేత వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం ఉంటాయి. ఈ టూర్‌కు పెద్దలకు రూ. 2,100, పిల్లలకు రూ. 1,680గా ధరను నిర్ణయించారు. ఈ టూర్‌ను తెలంగాణ పర్యాటక శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు, బుకింగ్స్ కోసం బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం (9848540371), సికింద్రాబాద్ యాత్రి నివాస్ (9848126947) లేదా పర్యాటక భవన్ (9848306435) నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
పర్యాటక యాత్రలో భాగంగా టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో టూరిస్టులు హైదరాబాద్ నుంచి బయల్దేరి మొదట యాదగిరిగుట్టలోని లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం పోచంపల్లి టూరిజం పార్కుకు చేరుకుంటుంది. మెట్రో నగరాల రణగొణ ధ్వనుల నుంచి దూరంగా, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణాన్ని పర్యాటకులకు పరిచయం చేయడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశం. ఈ యాత్రలో భాగంగా పర్యాటకులు పోచంపల్లికి చేరుకోగానే స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో స్వాగతం పలుకుతారు. బగారా అన్నం, రాగిజావ, లడెన్, పచ్చిపులుసు, పిడిల్స్, జొన్నరొట్టె, ఉల్లిగడ్డ పప్పు లాంటి ఎన్నో అథెంటిక్ రుచులను పర్యాటకులు ఇక్కడ ఆస్వాదించవచ్చు.
రుచికరమైన భోజనం తర్వాత పర్యాటకులను ఇక్కత్ మ్యూజియానికి తీసుకెళ్తారు. అక్కడ మగ్గాలపై నేసే చేనేత వస్త్రాల తయారీని పర్యాటకులు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. నూలు వడకడం, రంగుల అద్దకం (టై అండ్ డై), చిటికి కట్టడం వంటి ప్రక్రియలను నేరుగా చూసి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. చేనేత కళాకారులతో ముఖాముఖి మాట్లాడి, వారి శ్రమను, జీవన విధానాన్ని పర్యాటకులు దగ్గరగా పరిశీలించవచ్చు.
ఖండాంతర ఖ్యాతిని అర్జించిన చేనేత వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు, స్థానిక మహిళలకు, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా యాదాద్రి జిల్లా అధికార యంత్రాంగం ఎక్స్పీరియన్స్ పోచంపల్లి’ పేరుతో సరికొత్త కార్యక్రమం నిర్వహిస్తోంది. స్థానికంగా ఉన్న చేనేత కార్మికులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేకంగా గైడ్లుగా శిక్షణ ఇచ్చారు. వీరు పర్యాటకులకు ఇక్కడి విశేషాలను వివరంగా వివరిస్తారు. దీనివల్ల పర్యాటకులకు విజ్ఞానంతో పాటు, స్థానిక దుకాణాల్లో వస్త్రాల విక్రయాలు పెరిగి చేనేత కార్మికులకు మంచి మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయనీ యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.