
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆధార్ కార్డుతో అవసరం లేకుండా ప్రత్యేక కార్డును తెలంగాణ ప్రభుత్వం జారీ చేసేందుకు సిద్దమైంది. ఈ నెల నుంచే ఈ కార్డును మహిళలకు పంపిణీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన మహిళల వివరాలు సేకరించారు. వారికి ఉచితంగా ఈ కార్డులను అందించనున్నారు. దీంతో ఈ కార్డు చూపించి సులువుగా ఆర్టీసీ బస్సు్లో ఫ్రీ జర్నీ చేయవచ్చు.
చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డు ఇవ్వనున్నారు. ఏటీఎం కార్డు తరహాలో ఇది ఉంటుంది. మహిళల ఆధార్ కార్డు వివరాలు, ఫొటో సేకరించి చిప్‌తో అనుసంధానం చేస్తారు. అనంతరం స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. బస్ పాసుల తరహాలో వీటిని చూపించి మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ముందుగా ఒక డిపో పరిధిలో పైలట్ ప్రాజెక్టు తరహాలో స్మార్ట్ కార్డులు మహిళలకు జారీ చేయనున్నారు. అనంతరం వాటిల్లో వచ్చే సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించనున్నారు. జూన్‌లో వీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ కార్డులతో జారీపై అవసరమైన నిధులను ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీకి అందించింది. దీంతో స్మార్ట్ కార్డుల తయారీకి ఆర్టీసీ సిద్దమవుతోంది. కాగా మహాలక్ష్మి పథకం డిసెంబర్ 9,2023లో ప్రారంభించారు. ఈ పథకం వచ్చాక బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతీ బస్సులో 65 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఇక బస్సుల్లో ఆక్సుపెన్సీ రేషియో కూడా పెరిగిపోయింది. గతంలో 70 శాతం మాత్రమే ఉండగా.. ఇది వచ్చాక 120 శాతానికి పెరిగింది.