Telangana: తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్.. 15 భద్రతా ఫీచర్లతో నకిలీలకు చెక్!

Telangana: తెలంగాణలో మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 2011 నుంచి మీ సేవ సర్టిఫికెట్ల ముద్రణకు ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పేపర్ స్థానంలో మరింత నాణ్యత, భద్రత, మన్నిక కలిగిన కొత్త పేపర్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది..

Telangana: తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్.. 15 భద్రతా ఫీచర్లతో నకిలీలకు చెక్!
New Meeseva Certificate Paper

Edited By:

Updated on: Oct 13, 2026 | 8:45 PM

Telangana: ప్రభుత్వ ధృవపత్రాలను మరింత భద్రంగా, ఎక్కువ కాలం వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్ల కోసం అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ప్రత్యేక పేపర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ఈ కొత్త పేపర్‌తో సర్టిఫికెట్లు త్వరగా పాడవకుండా కాపాడుకోవడంతో పాటు నకిలీ పత్రాల తయారీని అడ్డుకునేందుకు అవకాశం కలగనుంది.

15 భద్రతా ఫీచర్లతో కొత్త పేపర్

మీ సేవ సర్టిఫికెట్ల కోసం రూపొందించిన కొత్త పేపర్‌లో మొత్తం 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. ప్రభుత్వ ధ్రువపత్రాలను నకిలీ చేయడం, అనధికారికంగా కాపీలు తయారు చేయడం వంటి అక్రమాలను నిరోధించడమే లక్ష్యంగా ఈ సాంకేతికతను వినియోగించారు. భద్రతా కారణాలతో ఈ ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు.

కొత్త పేపర్ ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ కాగితాల మాదిరిగా సులభంగా చిరిగిపోకపోవడం, నీళ్లు పడినప్పుడు త్వరగా దెబ్బతినకపోవడం. మడతలు పడటం, సాధారణ వినియోగం వల్ల పత్రాలు పాడయ్యే అవకాశాలను కూడా తగ్గించేలా దీనిని రూపొందించారు. దీంతో సర్టిఫికెట్లను ఎక్కువ కాలం భద్రపరచుకోవచ్చు. వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా లామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా తగ్గనుంది.

జనన, మరణ ధ్రువపత్రాలకు అదనపు భద్రత

జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు విద్యా, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు ఉపయోగించే సర్టిఫికెట్లు ప్రజలకు అత్యంత కీలకమైనవి. కొన్ని ధ్రువపత్రాలను జీవితాంతం భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి మన్నికను పెంచడం, అసలైన పత్రాలను గుర్తించే భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం ప్రభుత్వానికి ముఖ్యమైన అంశంగా మారింది. కొత్త సెక్యూరిటీ పేపర్ అందుబాటులోకి రావడంతో సర్టిఫికెట్లను దీర్ఘకాలం మంచి స్థితిలో ఉంచుకోవడానికి వీలవుతుంది. అదే సమయంలో నకిలీ పత్రాలపై నియంత్రణకు కూడా ఈ విధానం దోహదపడనుంది.

ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యం: శ్రీధర్‌బాబు

ప్రభుత్వం అందించే సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రజలు పొందే ధ్రువపత్రాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు వాటిపై విశ్వసనీయత కొనసాగడం అవసరమని వివరించారు. కొత్త పేపర్ ద్వారా ఈ రెండు లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

2011 నుంచి కొనసాగుతున్న సెక్యూరిటీ పేపర్ విధానం

తెలంగాణలో మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 2011 నుంచి మీ సేవ సర్టిఫికెట్ల ముద్రణకు ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పేపర్ స్థానంలో మరింత నాణ్యత, భద్రత, మన్నిక కలిగిన కొత్త పేపర్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజాభవన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, విజయ రమణారావుతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి. రవికిరణ్, ప్రభుత్వ అధికారులు, ప్రింటింగ్ ఏజెన్సీలు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us