Telangana: ఆ 550 ఎకరాలు ప్రభుత్వానివే.. మియాపూర్ భూములు కేసులో సుప్రీం సంచలన తీర్పు..

హైదరాబాద్ నగర శివార్లలో వేల కోట్ల రూపాయల విలువ చేసే మియాపూర్ భూములపై దశాబ్దాలుగా సాగుతున్న మహా భూపోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సర్కారు జాగాను కైవసం చేసుకోవాలని చూసిన ప్రైవేట్ వ్యక్తులకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఆ 550 ఎకరాలు ప్రభుత్వానివే.. మియాపూర్ భూములు కేసులో సుప్రీం సంచలన తీర్పు..
Supreme Court Verdict On Miyapur Lands

Edited By:

Updated on: Oct 29, 2026 | 6:40 PM

హైదరాబాద్ నగర శివార్లలో అత్యంత విలువైన మియాపూర్ భూములపై దశాబ్దాలుగా నడుస్తున్న సుదీర్ఘ భూవివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని 550 ఎకరాలకు పైగా ఉన్న భూములు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ భూములపై హక్కులు కోరుతూ బండారి రామచందర్ తదితరులు దాఖలు చేసిన అన్ని సివిల్ అప్పీళ్లను కొట్టివేసింది. ​గత 23 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ సంచలనాత్మక భూవివాదంలో 2003 నాటి ఉమ్మడి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ భూములను కైవసం చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు చెల్లవని తెలిపింది. అప్పీలుదారులు తమ హక్కులను నిరూపించడంలో విఫలమయ్యారని, ఎలాంటి పరిహారానికి కూడా వారు అర్హులు కారని పేర్కొంటూ సివిల్ అప్పీళ్లను కొట్టివేసింది.​వేల కోట్ల రూపాయల విలువైన 550 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఇది అతిపెద్ద విజయం.

పహాణీల్లో పేర్లు ఉన్నంతమాత్రాన హక్కులు రావు

​మియాపూర్ భూముల కేసును విచారించిన జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్య హక్కుల వాదనలను తిరస్కరించింది. 1912 నాటి సర్వే రికార్డుల ప్రకారమే ఈ స్థలాలు సర్కారీ పోరంబోకు భూముల కిందకి వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949 నాటి జాగీర్ల రద్దు చట్టంతోనే ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వ పరమయ్యాయని, ఆనాడే జాగీర్దార్లు పరిహారం కూడా తీసుకున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. జాగీర్ హక్కులు ఉన్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పహాణీల్లో అక్రమంగా పేర్లు నమోదు చేసుకున్నంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని, కబ్జాదారులు సమర్పించిన పత్రాలన్నీ నకిలీవేనని కోర్టు తేల్చిచెప్పింది.

Loading...
Unable to load recommendations.
Follow Us