Telangana: తెలంగాణలోని ఆ రూ. 2,200 కోట్లు ఎవరివి.! అందులో మీ డబ్బు కూడా ఉందా.?

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ క్లెయిమ్ కానీ మొత్తం కుబేరుడి అప్పు మాదిరిగా పెరిగిపోతోంది. పట్టణ ప్రాంతాల్లో వలసలు, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, చిరునామా మార్పులు.. ఇలా వివిధ కారణాల వల్ల ఈ మొత్తం అంతా ఎక్కువైపోయింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: తెలంగాణలోని ఆ రూ. 2,200 కోట్లు ఎవరివి.! అందులో మీ డబ్బు కూడా ఉందా.?

Edited By:

Updated on: Nov 24, 2025 | 11:50 AM

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో నిలిచిపోయిన అన్‌క్లెయిమ్డ్ డబ్బు పరిమాణం ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలు లక్షల సంఖ్యలో ఉండగా.. వాటిలో కోట్ల రూపాయలు ‘యజమాని ఎవరు?’ అనేది తెలియక మూలుగుతున్నాయి. ఈ వివరాలను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(SLBC) ఆర్బీఐకి నివేదించింది. సుమారు 80 లక్షల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,200 కోట్లు అన్‌క్లెయిమ్డ్ డబ్బు ఉన్నట్లు సమాచారం. ఖాతాదారులు నామినీ వివరాలు ఇవ్వకపోవడం, అకస్మాత్తుగా మరణించడం, చిరునామాలు మార్చి అప్డేట్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి టాప్‌లో

అన్నింటికంటే ఎక్కువగా అన్‌క్లెయిమ్డ్ సొమ్ము హైదరాబాద్ నగరంలోనే ఉంది. ఒక్క జిల్లాలోనే రూ. 850 కోట్లు నిలిచిపోయాయి. రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా రూ. 300 కోట్లతో ఉంది. వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పెద్ద మొత్తంలో ఖాతాలు క్లెయిమ్ లేకుండా నిలిచిపోయాయి.

బ్యాంకుల వారీగా పరిస్థితి..

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐలో అత్యధిక అన్‌క్లెయిమ్డ్ డబ్బు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. SBIలో 21.62 లక్షల ఖాతాల్లో రూ. 590 కోట్లు, UBIలో 20 లక్షల ఖాతాల్లో రూ. 470 కోట్లు.. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంకుల్లోనూ పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలో కూడా అన్‌క్లెయిమ్డ్ ఖాతాలు లక్షల్లో ఉండటం గమనార్హం. ఖాతాదారులు లేదా వారి వారసులు తమ పేరుతో ఏ బ్యాంకులో డబ్బు ఉందో తెలుసుకునేందుకు ఆర్బీఐ ‘ఉద్గం’ (UDGAM) అనే పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేరు, పాన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేస్తే, క్షణాల్లో ఖాతా వివరాలు కనిపిస్తాయి. ఖాతాదారుడు మరణించి ఉంటే, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ పత్రంతో బ్యాంకును సంప్రదించి డబ్బు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.

డిసెంబర్ 31 చివరి గడువు..

బ్యాంకులు రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు “వారసుల వేట” పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఈలోపు ఖాతాలను పునరుద్ధరించకపోతే, మొత్తాన్ని ఆర్బీఐ డీఈఏఎఫ్(Depositors Education and Awareness Fund)ఖాతాకు బదిలీ చేస్తారు. డీఈఏఎఫ్‌లోకి వెళ్లిన తర్వాత కూడా క్లెయిమ్ చేయవచ్చు కానీ ప్రక్రియ మరింత క్లిష్టంగా ఉంటుంది.

ఇన్‌ఆపరేటివ్ ఖాతాలు ఎందుకు పెరుగుతున్నాయి?

పట్టణ ప్రాంతాల్లో వలసలు, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యులకు తెలియని ఖాతాలు—ఇవి అన్నీ అన్‌క్లెయిమ్డ్ సొమ్ము పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు బ్యాంకులు అవగాహన కార్యక్రమాలను కూడా వేగవంతం చేశాయి.