Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి కళ్లెదుటే అమ్మానాన్న, తమ్ముడు మృతి..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన చేవెళ్ల మండలం గొల్లపల్లి స్టేజీ సమీపంలోని మజీద్‌ మలుపు వద్ద రాత్రి చోటుచేసుకుంది.

Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి కళ్లెదుటే అమ్మానాన్న, తమ్ముడు మృతి..
Chevella Road Accident

Edited By:

Updated on: Oct 07, 2026 | 9:51 AM

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన చేవెళ్ల నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు, ఆయన భార్య సావిత్రి, కుమారుడు ధనుష్‌, కుమార్తె అక్షయతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే తిరిగి స్వగ్రామానికి వస్తుండగా గొల్లపల్లి సమీపంలోని రాగానే వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది.

ఈ ప్రమాద తీవ్రతకు మధు, సావిత్రి, వారి కుమారుడు ధనుష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె అక్షయ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే కళ్లెదుటే తల్లిదండ్రులు, తమ్ముడు మరణించడంతో ఆ చిన్నారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రురాలైన చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన అధికారులు, ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని కనిపెట్టేందుకు ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us