
సినిమా రీళ్లని తలపించే ఘోరమైన పగ ఇది. కళ్లెదుటే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ కొడుకు గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలింది. కాలం గడుస్తున్నా కసి చల్లారలేదు. ఏకంగా 20 ఏళ్ల పాటు ఓపికగా వేచి చూశాడు. సరైన సమయం కోసం పక్కాగా స్కెచ్ వేశాడు. చివరకు, తన తండ్రిని చంపిన ప్రత్యర్థిని నడిరోడ్డుపై నరికి చంపి తన కసి తీర్చుకున్నాడు. కానీ, ఈ క్షణికానందం ఆ కుటుంబాన్ని జైలుపాలు చేసింది. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సూర్యాపేట మండలం యర్కారం గ్రామ మాజీసర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు . హత్యకు రాజకీయ కక్షలు కారణమని 2007లో జరిగిన అప్పటి యర్కారం గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా మధు హత్య జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ నరసింహ . హత్యలో పాల్గొన్న నింధితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు . వారి నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్ సహా 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు .
ప్రధాన నిందితుడు మిద్దె జీవన్‌గా తేల్చారు. 2007లో మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు కారణమైన చింతలపాటి మధుపై ప్రతీకారం పెంచుకున్న రవీందర్ కొడుకు మిద్దె జీవన్ తన స్నేహితులు, బంధువులతో కలిసి పక్కా ప్లాన్ తో మధుని హత్య చేశారని తెలిపారు. 2007లో తండ్రి రవీందర్ హత్య జరిగినప్పుడు జీవన్ కి ఏడేళ్ళ వయసు, తండ్రి హత్యతో కుటుంబం చితికి పోవడం, కోర్టులో సైతం రవీందర్ హత్య కేసు కొట్టివేయడంతో తండ్రి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతలపాటి మధుపై జీవన్ పగ మరింత పెరిగింది. దీంతో తన కుటుంబానికి అన్యాయం చేసిన మధుని ఎలాగైనా అంతమొందించాలని 2021 నుండి ప్రయత్నం చేస్తున్నాడు. జీవన్ రెండు, మూడు సార్లు హత్యకు ప్రయంత్నించినప్పటికి కుదరకపోవడంతో తాజాగా పక్కా ప్రణాళిక వేశాడు జీవన్.
చింతలపాటి మధు పెద్ద మనిషిగా చెలామణి అవుతూ పంచాయతీలు చేయడం, మద్యం తాగే అలవాటు ఉండటంతో జీవన్‌కు కలిసి వచ్చింది. మధుకి సమీప బంధువు అయిన అర్వపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన చింత సైదులు, యర్కారం గ్రామానికి చెందిన ప్రసాద్‌లను కోవర్టులుగా తయారు చేశాడు. పంచాయతీ ఉందని, మాట్లాడాలని మధుని సూర్యాపేట తాళ్ళగడ్డలోని సైదులు అద్దె ఇంటికి పిలిపించారు. సైదులు , ప్రసాద్. పరిచయస్థులు కావడంతో వారిని నమ్మి వెళ్ళిన మధుకు బాగా మద్యం తాగించారు. మత్తులో ఉండగా జీవన్‌కు సమాచారమిచ్చారు సైదులు, ప్రసాద్. అవకాశం కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద ఎదురు చూస్తున్న జీవన్ సైదులు, ప్రసాద్, ఆనంద్, భరత్ ల సహకారంతో తాగిన మైకంలో ఉన్న మధును దారుణంగా కత్తితో హత్య చేసి మృతదేహాన్ని అనుమానం రాకుండా గోనె సంచిలో కుక్కి మధు స్వగ్రామం యర్కారం సమీపంలోని కల్వర్టు వద్ద వదిలి వెళ్ళి పోయారు.
యర్కారం గ్రామములో 1985 నుండి ఇప్పటి వరకు వరుసగా 8 మంది రాజకీయ హత్యలకు బలి కావడంతో జిల్లా ఎస్పీ తక్షణమే 5 బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను 24 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించిన సైదులు భార్య భవాని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు ఎస్పీ. మృతుడు మధు సహా ప్రధాన నిందితుడు జీవన్, సైదులు, ప్రసాద్ పై గతంలోనూ పలు కేసులున్నాయి. వాటి తీవ్రత ఆధారంగా పీడీ యాక్ట్ కేసులు సైతం నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
తండ్రి హత్యకు జీవన్ కుటుంబం చిన్నాభిన్నమైంది. గ్రామంలో సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొని సతమతమైయ్యారు, ఏళ్ళు గడిచినా కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశించినా కోర్టులో తండ్రి హత్య కేసు వీగిపోవడం, ఇంతలో బీఆర్ఎస్ పార్టీ తరపున మధు సతీమణి మౌనిక గ్రామ సర్పంచ్ గా గెలవడంతో మధు మరింతగా బలపడ్డాడు. దీంతో తనకు ప్రాణహాని తప్పదని భావించిన మధు తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..