
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కూకట్‌పల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్(API) వ్యాపారంపై భారీ దాడి నిర్వహించింది. ఎక్సైజ్ శాఖతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో లైసెన్స్ లేకుండా APIల కొనుగోలు, విక్రయాలు జరుగుతున్న నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారు. కూకట్‌పల్లి ప్రశాంతి నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని NCS కాంప్లెక్స్‌లో సైనిక్స్ ల్యాబ్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థపై అధికారులు దాడి చేశారు. తనిఖీల్లో డ్రగ్ లైసెన్స్ లేకుండానే APIల వ్యాపారం సాగిస్తున్నట్లు తేలడంతో సంస్థపై కేసు నమోదు చేశారు. దాడి సందర్భంగా సంస్థ యజమాని గాడె రామకృష్ణ రెడ్డి వద్ద నుంచి 170 గ్రాముల జిడోవుడిన్ అనే యాంటీవైరల్ ఔషధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ APIల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు,ఇతర కీలక పత్రాలను కూడా అధికారులు సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్‌ను మేడ్చల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి. లక్ష్మీ నారాయణ, ప్రశాంతి నగర్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. గీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించగా, DCA డిప్యూటీ డైరెక్టర్ జి. శ్రీనివాస్ పర్యవేక్షించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాల నమూనాలను ప్రయోగశాలకు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్రమ APIల సరఫరా వ్యవస్థ వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని DCA తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా APIల విక్రయం, పంపిణీ చేయడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి నేరాలకు గరిష్ఠంగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. అక్రమ ఔషధ తయారీ, విక్రయాలు లేదా నార్కోటిక్, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే తెలంగాణ DCA టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.