Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలోనే..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరి ఏయే జిల్లాల్లో వర్షాలు పడతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలోనే..
Heavy Rain Alert Issued For Telangana And Ap

Updated on: Jul 17, 2026 | 8:58 PM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిసరాలపై కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీని ప్రభావంతో పాటు సముద్ర మట్టం వద్ద ఏర్పడిన రుతుపవన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉండటంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణకు 3 రోజుల వాతావరణ సూచన – హెచ్చరికలు

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ఏపీలో మత్స్యకారులకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్పపీడన ప్రభావంతో సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉంది. అలల ఉధృతి పెరుగుతున్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని ప్రఖర్ జైన్ వివరించారు.

ప్రజలకు కీలక సూచనలు..

ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో ప్రజలు కింది జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు ఎవరూ చెట్ల కింద గానీ, రోడ్ల పక్కన ఉండే భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదు. ఈదురు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు వంగినా, వైర్లు తెగిపడినా వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు ప్రయాణికులు వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

Follow Us