
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోషి నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆయన స్థానంలో జస్టిస్ సామ్ కోషి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
జస్టిస్ పి. సామ్ కోషికి సుదీర్ఘ న్యాయ అనుభవం ఉంది. 1967 ఏప్రిల్ 30న జన్మించిన ఆయన.. 1987లో కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 1990లో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1991 మార్చి 9న న్యాయవాదిగా నమోదు చేసుకుని న్యాయవృత్తిలోకి ప్రవేశించారు. సివిల్, రాజ్యాంగ, సర్వీస్, కార్మిక చట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు. తొలుత మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్‌లో 1991 నుంచి 2000 అక్టోబర్ వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం 2000 నవంబర్ నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు బిలాస్‌పూర్‌లో ప్రాక్టీస్ చేస్తూ దాదాపు 13 ఏళ్ల పాటు న్యాయవాదిగా కొనసాగారు.
న్యాయవాదిగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి కూడా న్యాయసేవలు అందించారు. 2002 నుంచి 2004 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2005-06లో డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్ అకాడమిక్ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా పనిచేశారు. న్యాయవాదిగా ఉన్న సమయంలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, కోల్ ఇండియా లిమిటెడ్, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం తదితర ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు న్యాయపరమైన వ్యవహారాల్లో ప్రాతినిధ్యం వహించారు.
సుదీర్ఘ న్యాయవాద వృత్తి అనంతరం 2013 సెప్టెంబర్ 16న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి నియమితులయ్యారు. అనంతరం 2016 మార్చి 8న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తుల బదిలీలో భాగంగా తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన.. 2023 జూలై 27న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి తెలంగాణ హైకోర్టులో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
జస్టిస్ సామ్ కోషికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వహించడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2025 జూలై 18 నుంచి 19 వరకు అప్పటి ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని సమయంలో తాత్కాలికంగా చీఫ్ జస్టిస్ విధులను నిర్వహించారు. ఇప్పుడు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో మరోసారి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి బాధ్యతలు చేపట్టనున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల న్యాయవృత్తి అనుభవం, ప్రభుత్వ న్యాయవాదిగా, డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన అనుభవం, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అదనపు, శాశ్వత న్యాయమూర్తిగా నిర్వహించిన బాధ్యతలు, తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న అనుభవం.. ఇవన్నీ జస్టిస్ సామ్ కోషి న్యాయ ప్రస్థానంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణ హైకోర్టు పరిపాలనా వ్యవహారాల్లో ఆయన సుదీర్ఘ న్యాయ అనుభవం కీలకంగా మారనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..