Telangana: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఉచిత చీరల పంపిణీకి అంతా సిద్దం.. ఆ రోజు నుంచే స్టార్ట్..

తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్. ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు అయింది. ఈ చీరలను ఉచితంగా పంపిణీ చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వీటిని మహిళలకు అందించనున్నారు.

Telangana: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఉచిత చీరల పంపిణీకి అంతా సిద్దం.. ఆ రోజు నుంచే స్టార్ట్..
Indiramma Sarees

Updated on: Nov 07, 2026 | 7:37 AM

తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇందిరమ్మ చీరల పంపిణీకి రంగం సిద్దమైంది. ఈ మేరకు మహిళలందరికీ అందించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వీటి పంపిణీ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రామన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 95 లక్షల మంది మహిళలకు ఉచితంగా చీరలను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.334 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది.

చీరల రంగుల్లో మార్పులు

రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరల రంగుల్లో మార్పులు చేసింది. గతంలో పాలపిట్ట రంగుతో కూడిన చీరలను పంపిణీ చేయగా.. ఇప్పుడు ఎరుపు రంగు జరీ అంచు కలిగిన చికలపచ్చ రంగు చీరలను అందించనుంది. ఏప్రిల్ నుంచి ఈ చీరల తయారీ ప్రారంభమవ్వగా.. ఇప్పటివరకు 65 లక్షల చీరల ఉత్పత్తి పూర్తయింది. ఇప్పటికే సిద్దమైన ఈ చీరలను అన్ని జిల్లాలకు ప్రభుత్వం తరలించింది. రెండు నెలల క్రితమే ఈ చీరలు తయారైనప్పటికీ.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం జాప్యం చేసింది. ఇంకా కొన్ని చీరల తయారీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 163 కేంద్రాల్లో చీరల తయారీ చేపడుతున్నారు. చీరల తయారీ ముగిసిన తర్వాత జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నారు. అయితే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీ నుంచి పంపిణీకి ఆమోదముద్ర వేసింది.

ఆధార్ కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే..

వారం రోజుల పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల్లోని మహిళలు ఆధార్ కార్డు తీసుకుని పంపిణీ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పంచాయతీ అధికారులకు ఆధార్ కార్డు అందించాలి. అనంతరం అధికారులు వివరాలను ధృవీకరించుకున్న తర్వాత మహిళలకు చీరలను అందిస్తారు. పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్‌లో చీరలు అందుకున్న మహిళల వివరాలను పంచాయతీ అధికారులు పొందుపరుస్తారు. దీని ద్వారా ఒక మహిళకు రెండుసార్లు చీరలు పంపిణీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్హలైన మహిళలందరికీ నాణ్యమైన చీరలను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ బాధ్యతలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, సెర్చ్ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే అప్పగించింది. మహిళలందరికీ వారం రోజుల్లోగా పంపిణీ చేయాలని ఆదేశించింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us