
1916 జనవరి 4న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఒట్టోమన్ రాజకుటుంబంలో నీలోఫర్ జన్మించారు. ఆమె తండ్రి సలాహుద్దీన్ బే ఒట్టోమన్ కోర్టులో కీలక స్థానంలో ఉండేవారు. తల్లి ఆదిల్ సుల్తానా.. సుల్తాన్ మురాద్ కుమార్తె. అయితే నీలోఫర్ రాజకుటుంబ జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1918లో ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత 1924లో టర్కీ రిపబ్లిక్‌గా మారడంతో ఒట్టోమన్ రాజకుటుంబ సభ్యులను దేశం నుంచి బహిష్కరించారు. అప్పటికి నీలోఫర్ వయసు కేవలం ఎనిమిదేళ్లు. తన తల్లితో కలిసి ఫ్రాన్స్‌లోని నైస్ నగరానికి వెళ్లిన నీలోఫర్ అక్కడ సాధారణ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. రాజకుటుంబంలో పుట్టినా ప్రైవేట్ ట్యూటర్లతో చదువుకునే అవకాశం లేకుండా సాధారణ పాఠశాలలో చదువుకున్నారు.
ఆ సమయంలో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం టర్కీ రాజకుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసేది. 1931లో నిజాం తన కుమారుల కోసం వివాహ సంబంధాలు చూస్తున్న సమయంలో నీలోఫర్ పేరు కూడా ముందుకు వచ్చింది. 1931 నవంబర్ 12న ఫ్రాన్స్‌లోని నైస్‌లో ఘనంగా జరిగిన డబుల్ వెడ్డింగ్‌లో నిజాం చిన్న కుమారుడు మోజాంజాతో నీలోఫర్ వివాహం జరిగింది. అదే వేడుకలో నిజాం పెద్ద కుమారుడు ఆజంజా.. ప్రిన్సెస్ దుర్రుషెహ్వార్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత నీలోఫర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె రాక అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. హైదరాబాద్ ప్రజలు కొత్త రాకుమారిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.
నీలోఫర్ కేవలం అందానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. అప్పటి హైదరాబాద్ రాజకుటుంబ మహిళలపై ఉన్న పర్దా సంప్రదాయాన్ని ఆమె ప్రశ్నించారు. పబ్లిక్ కార్యక్రమాలకు హాజరయ్యారు, వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇండియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ విభాగంతో కూడా ఆమె అనుబంధం కలిగి ఉన్నారు. సరోజినీ నాయుడు కుమార్తె పద్మజా నాయుడుతో ఆమెకు సన్నిహిత స్నేహం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నర్సింగ్‌లో శిక్షణ తీసుకుని గాయపడిన సైనికులకు సేవలు అందించారు. లేడీ హైదరీ క్లబ్ ద్వారా చారిటీ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి సహాయం చేశారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా అందం, రాజసంతో ప్రసిద్ధి చెందిన నీలోఫర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర విషాదం ఉంది. సొంత బిడ్డకు తల్లి కావాలన్నది ఆమెకు ఎంతోకాలంగా ఉన్న కోరిక. అందుకోసం యూరప్‌లోని పలువురు వైద్యులను సంప్రదించి చికిత్సలు తీసుకున్నప్పటికీ ఆమెకు సంతానం కలగలేదు. 1948లో వివాహమైన 17 ఏళ్ల తర్వాత ఆమె భర్త మోజాంజా మరో వివాహం చేసుకున్నారు. ఆ వివాహం తర్వాత వారికి పిల్లలు కూడా జన్మించారు. ఈ ఘటన నీలోఫర్‌ను తీవ్రంగా కలచివేసింది.
1949లో నీలోఫర్ జీవితంలో మరో విషాదకర సంఘటన జరిగింది. ఆమె వద్ద పనిచేసే రఫత్ ఉన్నీసా బేగం గర్భవతిగా ఉన్న సమయంలో ప్రసవానికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో మరణించారు. ఈ ఘటన నీలోఫర్‌ను తీవ్రంగా కదిలించింది. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నారు. అప్పుడే హైదరాబాద్‌లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ఆస్పత్రి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఆమె ఆలోచనకు మద్దతు ఇచ్చారు. రెడ్‌హిల్స్ ప్రాంతంలో స్థలం ఏర్పాటు చేసి ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆస్పత్రికి నీలోఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టారు. అయితే ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్ సంస్థానంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. ఈ సైనిక చర్యను ఆపరేషన్ పోలోగా పిలుస్తారు. ఆ సమయంలో నీలోఫర్ లండన్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసినా ఆమె తిరిగి వచ్చి ఆస్పత్రి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. అదే ఆమె హైదరాబాద్‌లో చేసిన చివరి ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఆమె శాశ్వతంగా లండన్‌కు వెళ్లిపోయారు. మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రాలేదు.
నీలోఫర్ హైదరాబాద్‌ను విడిచిపోయిన తర్వాత 1953లో ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రారంభంలో పరిమిత పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి కాలక్రమేణా విస్తరించింది. నేడు మహిళలు, చిన్నారులకు వైద్య సేవలు అందించే ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నీలోఫర్ హాస్పిటల్ ఒకటిగా నిలిచింది. పీడియాట్రిక్స్, నియోనాటాలజీ తదితర విభాగాల ద్వారా అనేక మంది చిన్నారులకు వైద్య సేవలు అందిస్తోంది. నీలోఫర్ అందం, ఫ్యాషన్ అభిరుచికి కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆమె ధరించిన చీరలు, ఇండియన్-వెస్ట్రన్ ఫ్యాషన్ కలయిక అప్పట్లో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆమె ఫ్యాషన్ గురించి అంతర్జాతీయ మ్యాగజైన్లలో కథనాలు ప్రచురితమయ్యాయి. నీలోఫర్ తన జీవితంలో ఫ్యాషన్, సామాజిక సేవ, మహిళా సంక్షేమం వంటి విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేశారు.
1952లో మోజాంజాతో నీలోఫర్ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. 1963 ఫిబ్రవరి 21న అమెరికన్ వార్ హీరో, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్ జూలియన్ పోప్‌ను వివాహం చేసుకున్నారు. 1989 జూన్ 12న పారిస్‌లో నీలోఫర్ కన్నుమూశారు. ఆమె చివరి కోరిక మేరకు తల్లి సమాధి పక్కనే ఆమెను ఖననం చేశారు. నీలోఫర్ జీవితంలో వ్యక్తిగత విషాదాలు ఎన్నో ఉన్నాయి. రాజకుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. భర్తతో విడిపోయారు. తల్లి కావాలన్న కోరిక కూడా తీరలేదు. అయినా తన బాధను తనలోనే దాచుకోకుండా.. అదే బాధను సమాజానికి ఉపయోగపడే శక్తిగా మార్చుకున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆమెను కదిలించింది. దాని ఫలితంగానే హైదరాబాద్‌లో మహిళలు, చిన్నారులకు అంకితమైన ఆస్పత్రి ఏర్పడింది. తాను తల్లి కాలేకపోయినా.. ఎంతోమంది తల్లుల పిల్లలకు వైద్యం అందించే ఆస్పత్రికి తన పేరును ఇచ్చిన రాకుమారి నీలోఫర్ కథ ఇది. హైదరాబాద్ చరిత్రలో ఆమె పేరు ఎప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఆమె రాజకుటుంబ నేపథ్యం మాత్రమే కాదు.. ఆమె చూపించిన మానవత్వం, మహిళల పట్ల ఆమెకున్న శ్రద్ధ, సమాజం కోసం చేసిన సేవ.