
రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించే దిశగా టీజీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తోంది. మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్లో మరో నాలుగు భారీ బస్ టెర్మినళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎంజీబీఎస్, జేబీఎస్ మాత్రమే పెద్ద టెర్మినల్స్ ఉన్నాయి. అయితే గాజులరామారం, శంషాబాద్, ఎల్బీ నగర్, ఘట్కేసర్లో బస్ టెర్మినల్స్ అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే వీటితో పాటు పలు ప్రధాన ప్రాంతాల్లో మరికొన్ని ఏరియాల్లో చిన్న బస్టాండ్లు ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఇక్కడ వేచి ఉండే హాళ్లు, పార్కింగ్ సదుపాయాలు వంటివి ఉంటాయి. దీని వల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తోంది.
రాబోయే రోజుల్లో కొత్తగా 2200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పీఎం-ఈబస్ పథకం కూడా వీటిని అందిస్తోంది. వీటి రాకతో టీజీఎస్ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెరగనుండగా.. దీనికి తగ్గట్లు ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. దీంతో ప్రయాణికుల సామర్థ్యానికి అనుగుణంగా కొత్త బస్ టెర్మినల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది. గాజులరామారంలో ఏకంగా 100 ఎకరాలతో భారీ బస్టాండ్ నిర్మాణానికి ఇప్పటికే లైన్ క్లియర్ అవ్వగా.. శంషాబాద్లో 150 ఎకరాలను టెర్మినల్ కోసం పరిశీలిస్తున్నారు. ఇక శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, ఘట్కేసర్లో కూడా కొత్త టెర్మినళ్ల కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించేందుకు ఈ బస్టాండ్లు కీలక పాత్ర పోషించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిటీ బస్సులు, మెట్రోలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయడంలో ఈ బస్టాండ్లు కీలకంగా ఉంటాయని అంటున్నారు. ఈ టెర్మినళ్లు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు అనుసంధాన్ని కలిగించనున్నాయి.
నగరు శివార్లలో ఏర్పాటు చేయనున్న ఈ టెర్మినళ్ల వల్ల నగరంలో లోపల ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ప్రస్తుతం బస్సులన్నీ సిటీ లోపలికి రావడం వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడుతుంది. అంతరాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగరం లోపలికి రానీయకుండా ఈ టెర్మినళ్ల ద్వారా వెళ్లేలా చేయనున్నారు. దీని వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణికులు సులువుగా తమ ప్రాంతాల సమీపం నుంచే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. గాజులరామారంలో అతి పెద్ద టెర్మినల్ నిర్మించేందుకు ఇప్పటికే కొంత భూమి సేకరించారు. రాబోయే కొన్ని నెలల్లో ఇక్కడ బస్టాండ్ నిర్మాణం మొదలయ్యే అవకాశముంది.