
హైదరాబాద్: బెడ్ రూమ్‌లో మంచం కింద బోరు, కిచెన్‌లో బోరు, నీళ్ల సంపులో బోరు, మెట్ల కింద చూసినా బోరు.. ఎక్కడ పడితే అక్కడ బోరు వేసి.. అడ్డ దిడ్డంగా పైప్ లైన్లు వేసి.. అక్రమంగా పైప్ కనెక్లన్లతో అడ్డగోలుగా నీటి దందా చేస్తున్న ఉదంతం మాదాపూర్‌లోని సున్నం చెరువులో మరోసారి వెలుగులోకి వచ్చింది. భూమికి చిల్లులు పెట్టి.. భూగర్భ జలాన్ని పీల్చేస్తున్న ముఠాపై అధికారులు ఫోకస్ పెట్టారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు పక్కనున్న నవభారత్‌నగర్‌లో శనివారం 21 అక్రమ బోరుబావులను ధ్వంసం చేశారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ, జలమండలి, విద్యుత్తు, రెవెన్యూ అధికారులతో కలిసి అధికారులు అక్రమ బోరుబావులు, భూగర్భ పైపులైన్లను పెద్దఎత్తున తొలగించారు.
భూగర్భ పైపులైన్లను తవ్వుకుంటూ వెళ్తుంటే.. ఒక్కో పైపు ఒక్కో ఇంటికి దారి చూపింది. ఓ ఇంటి నుంచి మూడు పైపులైన్లు ఫిల్లింగ్ కేంద్రానికి కనెక్ట్ చేయబడి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక.. బెడ్రూమ్లో మంచం కింద, నీటి సంపులో, మెట్ల కింద, వంట గదిలో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసుకుని.. నీటిని అమ్ముకుంటున్నట్లు తేలింది.
సున్నం చెరువు చుట్టుపక్కల నీటిలో ప్రమాదకర లోహాలు ఉన్నట్టు తేలడంతో అక్కడి బోరుబావులను తొలగించేలా గతంలో హైడ్రా ఆదేశాలిచ్చింది. కొన్నాళ్లు మౌనంగా ఉన్న ట్యాంకర్ల యజమానులు.. చెరువు పక్కనున్న కాలనీపై కన్నేశారు. కొన్ని ఇళ్లలో సొంతంగా బోర్లు వేయించారు. అప్పటికే ఉన్న బోరుబావులను లీజుకు తీసుకున్నారు. వాటన్నింటినీ భూగర్భ పైపులైన్లతో అనుసంధానం చేసి రోజంతా నీటిని తోడుతూనే ఉన్నారు. అయ్యప్ప సొసైటీ, బోరబండ, మాదాపూర్, హైటెక్‌సిటీలోని హాస్టళ్లు, హోటళ్లు, వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.
10 వేల లీటర్ల ట్యాంకరును రూ.10వేల చొప్పున అమ్ముతున్నారంటే వీళ్ల దందా ఏ రేంజ్లో సాగుతుందో ఊహించండి. అక్రమంగా సంపాదించేందుకు కలుషిత నీటిని కూడా సప్లై చేస్తున్నారు నీటి దొంగలు.. సున్నం చెరువులో నీటిమాఫియాపై ప్రస్తుతం హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ బోర్లు, ట్యాంకర్ల దందాపై ఫొటోలతో సహా రిలీజ్ చేసింది హైడ్రా..
అయితే.. మున్ముందు అన్నీ ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.