
మైలార్దేవ్పల్లి పారిశ్రామిక వాడలోని ఒక గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల ఉన్న ఇతర గోదాములు, పరిశ్రమలకు కూడా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఆకాశాన్ని తాకేలా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. కిలోమీటర్ల దూరం వరకు కూడా పొగ కనిపిస్తుండటంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజిన్లను రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. చుట్టుపక్కల ఇతర పరిశ్రమలకు మంటలు విస్తరించకుండా సకాలంలో అడ్డుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని లక్షలాది రూపాయల విలువైన ముడిసరుకు, యంత్ర సామగ్రి, తయారైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. లేదంటే పెను ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు, ఫైర్ ఆఫీసర్లు దర్యాప్తు ప్రారంభించారు. పారిశ్రామిక వాడలలో భద్రతా ప్రమాణాలు పాటించని యూనిట్లపై తనిఖీలు ముమ్మరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధి సీతాఫల్ మండిలోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన ఓ టపాసుల దుకాణంలో మంటలు చేలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, దుకాణ యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని టపాసులు మొత్తం కాలి బూడిదైనట్టుగా సమాచారం. కాగా, ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణాపాయం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, జరిగిన ఆస్తి నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.