
టెక్నాలజీ యుగంలోనూ మూఢ నమ్మకాలతో మోసపోతున్నారు కొందరు అమాయకులు. దోషాలు పోతాయని కొందరు .. డబ్బుపై అత్యాశతో మరికొందరు.. ఇలా నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో ఓ బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీలో మంజునాథ్ స్వామీజీ అలియాస్ అర్జున్ కోయరాజు అనే నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతిష్యం పేరుతో మహిళలను బాబా లోబర్చుకుంటున్నారని.. ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిపారు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్య. వరంగల్‌లో నివాసముండే అర్జున్ కోయరాజు.. ఎలాంటి మంత్రాలు, పూజలు రాకపోయినా నకిలీ బాబా అవతారమెత్తాడు. ఈ క్రమంలో.. సమ్మక్క-సారక్క జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.
దాంతో.. ఓ లోకల్ టీవీ చానల్‌లో నకిలీ బాబా ఇచ్చిన ప్రకటన చూసిన పాతబస్తీ చెందిన బాధిత కుటుంబం ఆయన్ను కాంటాక్ట్ అయింది. ఆ ఫ్యామిలీలో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నకిలీబాబా నయం చేస్తానని చెప్పడంతో నమ్మారు. చేయి చూసి బాగు చేస్తానని.. ఇంట్లో పూజలు చేసి జబ్బు నయం చేస్తానని నమ్మించాడు. అంతే.. నరదోషంతోపాటు రకరకాల పేర్లు చెప్పి.. పూజలు చేయాలని 17 లక్షలు వసూలు చేశాడు.
ఎన్నాళ్లు పూజలు చేస్తున్నా వ్యాధి నయం కాకపోవడంతో మోసం పోయామని గుర్తించి ఛత్రినాక పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దాంతో.. నకిలీబాబా గుట్టురట్టు అయింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మంజునాథస్వామీజీ అలియాస్ అర్జున్ కోయరాజు అనే ఫేక్ బాబా అరెస్ట్ చేశారు. ఇక.. నకిలీబాబా నుండి 14.65 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్య.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..