
Hyderabad: పబ్లిక్ ప్లేస్‌లలో మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ హల్చల్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నగరవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 110 మందిని అదుపులోకి తీసుకొన్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, ధూమపానం చేయడం వల్ల సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీరియస్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, పార్కులు మరియు నిర్మానుష్య ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నిబంధనలు ఉల్లంఘించిన 110 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిలో యువత ఎక్కువగా ఉండటంతో వారికి స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. బహిరంగ ధూమపానానికి సంబంధించి జరిమానాలు విధించడమే కాకుండా, పదే పదే తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుంది. నగర శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అంటున్నారు పోలీసు అధికారులు.
పోలీసుల ఈ మెరుపు దాడులతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల పక్కన, అపార్ట్‌మెంట్ సెల్లార్లలో సిట్టింగ్‌లు వేసే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల ఈ నిర్ణయంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపై తిరిగే మహిళలు ఈ చర్యల వల్ల భద్రత పెరుగుతుందని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి