
GHMC-ISKCON Hyderabad: ఇళ్లలో పూజలు చేసిన పాత దేవతా పటాలు, విగ్రహాలను చాలా మంది చెరువులు, బావులు, నదులు లేదా చెత్త కుప్పల్లో పడేస్తుంటారు. దీంతో అవి ఇతర వ్యర్థాలతో కలిసిపోయి పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా ఆధ్యాత్మిక భావాలను కూడా దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితికి పరిష్కారంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో, ప్రజలు తమ ఇళ్లలో ఉన్న పాత దేవుడి పటాలు, విగ్రహాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఇస్కాన్ ఆలయానికి స్వచ్ఛందంగా అందజేయవచ్చు. వీటికి సంప్రదాయ పద్ధతిలో ఉద్వాసన నిర్వహించి, అనంతరం పర్యావరణహిత రీసైక్లింగ్ ప్రక్రియ చేపడతారు.
దేవుడి పటాలు లేదా విగ్రహాలను తీసుకువచ్చే భక్తులు ముందుగా ఆలయ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆలయ ప్రాంగణంలో వాటిని భద్రపరుస్తారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల తర్వాత అన్ని పటాలు, విగ్రహాలకు కలిపి ప్రత్యేక ఉద్వాసన పూజ నిర్వహిస్తారు. ఆ తరువాత శిక్షణ పొందిన వాలంటీర్లు రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. పటాల్లోని అద్దాలు, చెక్క భాగాలు, కాగితాలు, ఇతర పదార్థాలను వేరు చేసి వాటిని తిరిగి వినియోగానికి అనువుగా మార్చేందుకు రీసైక్లింగ్ కేంద్రాలకు పంపిస్తారు. ఈ విధానం ద్వారా చెత్తగా మారిపోయే వస్తువులకు కొత్త జీవం లభించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుంది.
జీహెచ్‌ఎంసీ అధికారుల ప్రకారం నగరంలోని డంపింగ్ యార్డులకు ప్రతిరోజూ భారీ స్థాయిలో వ్యర్థాలు చేరుతున్నాయి. వాటిలో ఆహార అవశేషాలు, ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఔషధాలు, దేవతా పటాలు వంటి అనేక వస్తువులు ఉంటాయి. మట్టి మినహా మిగతా చాలా వస్తువులను మళ్లీ వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇంటి వద్దే వ్యర్థాలను వేరు చేసి అందిస్తే తక్కువ ఖర్చుతో రీసైక్లింగ్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రత్యేక సేకరణ కేంద్రాలు, ఈ-వేస్ట్ బిన్లు ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ, ఇప్పుడు దేవుడి పటాలు, విగ్రహాల సేకరణపై కూడా దృష్టి సారించింది.
🙏♻️ Don’t know what to do with old deity photographs, damaged frames, worn-out idols, and sacred items that have completed their worship journey?
Old pooja frames, deity photographs, damaged idols, and sacred items should never be discarded carelessly.
To provide a respectful… pic.twitter.com/s1pHxSQ8Mf
— GHMC (@GHMCOnline) June 5, 2026
పూజలు, వ్రతాలు లేదా ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఆరాధించిన దేవతలకు గౌరవప్రదంగా వీడ్కోలు చెప్పే ఆచారాన్ని ‘ఉద్వాసన’ అంటారు. ఈ సందర్భంగా విగ్రహాలు లేదా పటాలను కదిలిస్తూ, దైవత్వం తన యథాస్థానానికి చేరాలని ప్రార్థనలు చేస్తారు. హిందూ సంప్రదాయంలో ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా భావిస్తారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా పాత దేవతా పటాలు, విగ్రహాలకు గౌరవప్రదమైన నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మార్గం సుగమం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.