
పండుగ అనగానే వెలుగులు, సంతోషాలు పంచుకునే దీపావళి వేళ.. ఈసారి బాణాసంచా ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పటాకుల ధరలు ఆకాశాన్నంటడంతో దీపావళికి టపాసులు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. జేబులు గుల్లవుతున్నాయంటూ సామాన్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ధరలు మండిపోతున్నాయి.. హైదరాబాద్, విజయవాడ సహా.. అన్ని ప్రాంతాల్లో ధరలు భారీగా పెరిగాయి.. మార్కెట్లో పిట్ట బాంబుల నుంచి మొదలుకుని మోత మోగే ఉల్లిగడ్డ బాంబుల వరకు అన్ని రకాల టపాసుల ధరలు దాదాపు రెట్టింపు (డబుల్) అయ్యాయి. మార్కెట్‌కు రూ. 5,000 తీసుకువెళ్తే తప్ప కనీసం 10 రకాల పటాసులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టపాసులు కొనేందుకు వెనకంజ వేస్తున్నారు.
ధరలు విపరీతంగా పెరగడంపై వ్యాపారులు స్పందిస్తూ.. తయారీ కంపెనీలే నేరుగా 50 శాతం వరకు రేట్లు పెంచేశాయని వాపోతున్నారు. బాణాసంచా తయారీకి అవసరమైన రసాయనాలు, ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. లేబర్ ఛార్జీలు, రవాణా ఖర్చులు భారీగా పెరగడంతో తయారీ వ్యయం పెరిగిందని తయారీదారులు చెబుతున్నారు. కొనుగోలుదారులకు గతంలో మాదిరిగా భారీ డిస్కౌంట్లు ఇచ్చే పరిస్థితి లేదని, పెరిగిన ధరలకే అమ్ముకోవాల్సి వస్తోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మొత్తంగా, విపరీతంగా పెరిగిన ధరల కారణంగా బాణాసంచా కొనుగోలును చాలా వరకు తగ్గించుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.