Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నిమజ్జనాలకు ఆటంకం..

|

Sep 27, 2023 | 6:40 PM

హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది.  ఒక్కసారిగా నగర వాతావరణం మారిపోయింది.  హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలో భారీ వర్షం కురవడంతో..  నిమజ్జనాలకు ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో  లోతట్టు ప్రాంతాలను  జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.  మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.  పూర్తి వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి

Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నిమజ్జనాలకు ఆటంకం..
Hyderabad Rain
Follow us on

భాగ్యనగరాన్ని మళ్లీ వరణుడు పలకరించాడు. ముఖ్యంగా జంట నగరాల్లో వరణుడు ఈదురుగాలులతో కూడిన వర్షంతో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల సాయంత్రం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దైంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో వాతావరణశాఖ హైదరాబాద్ లో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం….

హైదరాబాద్ లో నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఆఫీసుల నుంచి ఇంటికిపోయే సమయంలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా జంట నగరాల్లోని సికింద్రాబాద్, బోయిన్ పల్లి, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు వచ్చి చేరుతుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్థంభించిపోయింది. ప్రధాన కూడళ్లలో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. నగరవాసులు ఇంటికి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జీహెచ్ఎంసీ బృందాలు, సిబ్బంది రంగంలోకి దిగి వర్షపు నీటిని తొలగించి ట్రాఫిక్ సవ్యంగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వర్షం నిరంతరాయంగా కురుస్తూ ఆటంకం కలిగిస్తూనే ఉంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించింది. మరో 3 రోజుల పాటు తెలంగాణలో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిర్మల్, నల్గొండ, భువనగిరి, అదిలాబాద్, జనగాం జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందనీ.. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

మరోవైపు నగరవ్యాప్తంగా గణేషుడి శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలకు ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలో భారీ వర్షం కురువడం ఆటంకంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి