AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ చూసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు తయారీ.. చివరకు పోలీసులకు ఎలా దొరికిపోయారంటే?

Hyderabad Fake Currency Racket: హైదరాబాద్ శివారులో యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును తెలంగాణ పోలీసులు రట్టు చేశారు. అద్దె ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రింటింగ్ యూనిట్ నుంచి రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

యూట్యూబ్ చూసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు తయారీ.. చివరకు పోలీసులకు ఎలా దొరికిపోయారంటే?
Hyderabad Fake Currency Racket
Rajashekher G
|

Updated on: Nov 05, 2026 | 7:38 AM

Share

Hyderabad Fake Currency Racket: హైదరాబాద్ శివారులో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును తెలంగాణ పోలీసులు రట్టు చేశారు. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ చూసి నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకున్న ప్రధాన నిందితుడు.. ఏకంగా ప్రింటింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, వారి నుంచి సుమారు రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

నవంబర్ 1న రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని జాతీయ రహదారి 65పై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో రూ.8 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు లభించాయి. కారులో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా హైదరాబాద్ శివారులోని కుంట్లూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో నకిలీ నోట్ల తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ మరో 134 కట్టల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6.70 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కలర్ ప్రింటర్లు, స్కానర్లు, ల్యాప్‌టాప్, లామినేషన్ మెషిన్, నోట్లు కత్తిరించే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు మడుపోజు కర్ణాకర్ యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ ద్వారా నకిలీ నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు. అసలైన రూ.500 నోట్లను స్కాన్ చేసి, ఫొటోషాప్ వంటి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో మార్పులు చేసి నకిలీ నోట్లు ముద్రించినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులమంటూ డబ్బులు దోపిడీ

మొదట రూ.లక్ష అసలు నగదుకు బదులుగా రూ.3-4 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపి ఈ ముఠా మోసాలకు పాల్పడాలని ప్రయత్నించింది. అయితే కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో మరో పథకం వేసింది. అసలు నోట్లను చూపించి నమ్మకం కలిగించిన తర్వాత నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, నకిలీ తుపాకులు, ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలతో పోలీసులుగా నటించేవారు. అనంతరం కొనుగోలుదారులను బెదిరించి వారి అసలు డబ్బుతో పరారయ్యేవారు. ఇలా ఇద్దరి నుంచి వరుసగా రూ.2 లక్షలు, రూ.3 లక్షలు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో మడుపోజు కర్ణాకర్, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్ రెడ్డి, కరణం అజయ్ కుమార్‌లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us