
దారిదోపిడీలు, నేరాలకు పాల్పడే ముఠాలను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టాల్సిన పోలీసులే.. దొంగలతో చేతులు కలిపారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామంటూ నకిలీ పోలీస్ యూనిఫామ్‌లు ధరించి, కోట్లలో ఆశ చూపి కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. చివరకు అసలు పోలీసుల వ్యూహాత్మక దర్యాప్తులో దొరికిపోయి కటకటాలపాలయ్యారు. ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ అంతర్రాష్ట్ర డెకాయిట్ కేసును సత్తుపల్లి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ దారిదోపిడీ ముఠాకు చెందిన 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ముఠాలో ఒక టీజీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్, ఒక ఆర్ఎస్ఐ ఉండడం స్థానికంగా సంచలనంగా మారింది.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఈదా చంటిబాబు (A1) వృత్తి రీత్యా పెయింటింగ్ వర్క్ చేస్తుంటాడు. అయితే పేరుకు పెయింటర్ అయినప్పటికీ నేరాలు చేయడంలో ఇతనిది మాస్టర్ మైండ్. ఒరిజినల్ నోట్లు ఇస్తే దానికి రెట్టింపు మొత్తంలో దొంగ నోట్లు ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేయడం ఇతని శైలి. ఈ క్రమంలోనే చంటిబాబుకు సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలోని 15వ గిరిజన బెటాలియన్‌లో పనిచేస్తున్న టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, అదే బెటాలియన్‌లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న బేరా కేశవరావులతో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ఇద్దరు ఖాకీలు పెయింటర్ చంటిబాబుతో చేతులు కలిపారు. వీరంతా కలిసి మరో 11 మందితో ఒక అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి కుర్రా గంగాధర్ రెడ్డి బ్యాంక్ ఖాతాలో రూ.2 కోట్ల నగదు ఉంది. వాటిని మార్చేందుకు అతను ఏజెంట్లను సంప్రదించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఏజెంట్లు.. సాగి సుబ్బరాజు, కాపా శ్రీను, కురబ గణేష్, ఉపేంద్రం జనార్ధన్ రాజు, రామాంజనేయులు, రాజు తమ కమీషన్ల కోసం A1 మాస్టర్ మైండ్ చంటిబాబు ముఠాతో చేతులు కలిపారు. పక్కా ప్లాన్ ప్రకారం గంగాధర్ రెడ్డిని సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం గ్రామానికి రప్పించారు.
ముఠా మాటలు నమ్మిన వ్యాపారి గంగాధర్ రెడ్డి రూ.10 లక్షల అసలు నగదును బ్యాగులో పెట్టుకుని గంగారం గ్రామానికి చేరుకున్నాడు. నగదు ఉన్న బ్యాగును చూడగానే.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చంటిబాబుతో పాటు కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, ఆర్ఎస్ఐ బేరా కేశవరావు మరికొంతమందితో కలిసి నకిలీ పోలీస్ యూనిఫామ్‌లు ధరించి, ఒరిజినల్ పోలీసుల తరహాలో అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. పోలీస్ రైడ్ అంటూ అక్కడ ఒక్కసారిగా హల్ చల్ చేశారు. నిజంగానే పోలీసులు దాడి చేశారని భయపడిన బాధితుడు గంగాధర్ రెడ్డి, అతని అనుచరులు భయంతో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. ఇదే అదనుగా భావించిన నకిలీ పోలీస్ ముఠా.. గంగాధర్ రెడ్డి తెచ్చిన రూ.10 లక్షల నగదు బ్యాగుతో అక్కడి నుండి చాకచక్యంగా ఉడాయించింది.
తాము దారుణంగా మోసపోయామని, తమ డబ్బు దోపిడీకి గురైందని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు గంగాధర్ రెడ్డి వెంటనే సత్తుపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీస్ బృందం పక్కా నిఘా, ప్లానింగ్‌తో దర్యాప్తు చేపట్టింది. దోపిడీకి పాల్పడింది తమ శాఖకు చెందిన వారేనని తేలడంతో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. చివరకు ఈ ముఠాలోని ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్, పెయింటర్ చంటిబాబు సహా 12 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రక్షక భట నిలయాల్లో ఉంటూ భక్షకులుగా మారిన ఈ కిలాడీ ఖాకీల నిర్వాకం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.