
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 5: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. చేపల కోసం వేసిన గేలానికి ఏకంగా మొసలి పిల్ల చిక్కడంతో అతడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరూబాక గ్రామ శివారులో చోటుచేసుకుంది.
శనివారం రాత్రి గోదావరి నది తీరానికి వెళ్లిన యువకుడు చేపలు పడతాయనే ఆశతో గేలాలు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకే నది వద్దకు చేరుకుని గేలాలకు చేపలు చిక్కి ఉంటాయని భావించాడు. అయితే గేలాలను బయటకు లాగుతుండగా అతడికి ఊహించని దృశ్యం కనిపించింది. గేలానికి ఓ మొసలి పిల్ల చిక్కుకుని కదులుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అది చూసిన యువకుడికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. కొద్దిసేపటి తర్వాత భయం నుంచి తేరుకున్న అతడు, ఈ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించాడు.
అనంతరం మొసలి పిల్లకు ఎలాంటి హాని కలగకుండా గేలాలతో సహా దాన్ని తిరిగి గోదావరి నదిలోకి వదిలేశాడు. దీంతో ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. స్థానికుల అంచనా ప్రకారం ఆ మొసలి పిల్ల సుమారు 5 కిలోల బరువు, దాదాపు 2 అడుగుల పొడవు ఉండొచ్చని తెలుస్తోంది. చేపల కోసం వేసిన గేలానికి మొసలి పిల్ల చిక్కడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.