
యువత ఐటీ కలల సౌధం అమీర్‌పేట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. వేలాది మంది విద్యార్థులతో నిత్యం కిటకిటలాడే మైత్రీవనం నీలగిరి బ్లాక్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని ఒక కోచింగ్ సెంటర్ నుంచి దట్టమైన పొగలు రావడంతో విద్యార్థులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం చేయగా, స్థానికులు వారిని వారించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం లోపల చిక్కుకున్న విద్యార్థులను క్రేన్ల సహాయంతో బాల్కనీల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనంలో కంప్యూటర్ హార్డ్‌వేర్ షాపులు, పైన ఇన్‌స్టిట్యూట్లు ఉండటంతో మంటలు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమీర్‌పేట్ అంటేనే ఐటీ కోచింగ్‌కు మారుపేరు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలమంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ భవనాలు అన్నీ చాలా పాతవి, ఇరుకైనవి కావడంతో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు బయటకు రావడం క్లిష్టంగా మారుతోంది. ఇంతటి రద్దీ ఉండే భవనాల్లో కనీస అగ్నిమాపక భద్రత ఉందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.