
Festival Travel Alert: దసరా పండుగ.. విద్యాసంస్థలకు సెలవులు.. కుటుంబంతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. అయితే పండగ సందడిలో ప్రయాణ ఏర్పాట్లపై చూపించే శ్రద్ధ.. ఇంటి భద్రతపై కూడా చూపించాల్సిన అవసరం ఉంది. చిన్న నిర్లక్ష్యం మీ ఇంటి భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే పండగ వేళ మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ప్రజలు ఊళ్లకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా మూసివేయాలని, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా వెల్లడించకూడదని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
ప్రయాణ సమయంలో ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని పేర్కొన్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం చేయకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని సూచించారు.
పిల్లలను రద్దీ ప్రదేశాల్లో ఒంటరిగా వదిలివేయకూడదని, ప్రయాణాల్లో వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని, పోలీసులకు సహకరిస్తూ దసరా పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోరారు జిల్లా ఎస్పీ జానకి.