ఆ శాఖల ఉద్యోగులే టార్గెట్.. ఫోన్ చేసి మాట్లాడుతారు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైద్ది..

సూర్యాపేట జిల్లాలో ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. అవినీతి కేసులు నమోదు చేస్తామని భయపెట్టి ఎస్సీ అభివృద్ధి శాఖకు చెందిన ముగ్గురు సస్పెండైన ఉద్యోగుల నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు సమాచారం. మరోవైపు ఉద్యానవన శాఖ అధికారిని రూ.1.9 లక్షలకు మోసం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది.

ఆ శాఖల ఉద్యోగులే టార్గెట్.. ఫోన్ చేసి మాట్లాడుతారు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైద్ది..
Suryapet Fake Acb Scam

Edited By:

Updated on: Oct 11, 2026 | 12:00 PM

ఏసీబీ అంటే అవినీతి అధికారుల గుండెల్లో గుబులు.. అక్రమార్కుల గుండెల్లో వణుకు. ఏసీబీ పేరు.. కొందరు మోసగాళ్లకు వసూళ్ల అస్త్రంగా మారింది. నిజమైన అధికారుల్లా మాట్లాడటం.. అవినీతి ఫిర్యాదులు వచ్చాయని భయపెట్టడం.. కేసులు నమోదు చేస్తామంటూ హడలెత్తిస్తున్నారు. ఏసీబీ పేరును అడ్డం పెట్టుకుని వసూళ్ల దందాకు తెరలేపారు. సస్పెండైన ఉద్యోగులే లక్ష్యంగా ఫేక్ ఏసీబీ పేరుతో వసూళ్ల దందా సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతోంది.

ఏసీబీ ముసుగులో కొత్త దందా..

సూర్యాపేట జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న జిల్లా అధికారులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాము ఏసీబీ అధికారులుమని.. నీపై తమకు ఫిర్యాదులు వచ్చాయని, త్వరలో దాడులు జరుగుతాయని బెదిరిస్తున్నారు. తాజాగా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖలో సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు ఉద్యోగులను నకిలీ అధికారులు టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులమంటూ ఫోన్లు చేసి.. విచారణ, కేసుల పేరుతో భయపెట్టి.. వారి నుంచి లక్ష రూపాయలు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నారు. డబ్బులు అందిన తర్వాత ఫోన్‌కు స్పందించకుండా తప్పించుకున్నారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఉద్యానవన శాఖ అధికారికి రూ.1.9 లక్షల టోకరా..

ఇటీవల నల్లగొండ జిల్లాలో ఉద్యానవన శాఖాధికారి ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఏసీబీ అధికారులమని చెప్పుకునే వ్యక్తులు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ఉద్యానవన శాఖాధికారులకు ఫోన్లు చేసి బెదిరించారు. నల్లగొండలో ఏసీబీ దాడులు జరిగాయని తర్వాత మీ మీదనే దాడులు చేస్తామని వారిని భయభ్రాంతులకు గురిచేశారు. దాడులు జరగకుండా ఆపాలంటే తాము చెప్పిన ప్రాంతానికి రావాలని ఆదేశించారు. దీంతో ఆందోళన చెందిన సూర్యాపేట జిల్లా అధికారి కేటుగాళ్లకు 1.9 లక్షలు సమర్పించుకున్నాడు. తర్వాత తెలుసుకుంటే వారు మోసగాళ్లు అని నిర్ధారణ కావడంతో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో గత నెలలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పది శాఖలే టార్గెట్..

జిల్లాలోని దాదాపు 10 ప్రభుత్వ శాఖల అధికారులు , ఉద్యోగులను నకిలీ ఏసీబీ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. జిల్లా ఉద్యానవన శాఖతో పాటు ఫిషరీస్, వైద్య ఆరోగ్య, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి ఏసీబీ పేరుతో ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మీపై తీవ్రమైన అవినీతి ఫిర్యాదులు వచ్చాయనీ, కేసు నమోదు కాకుండా ఉండాలంటే మేం చెప్పినట్లు చేయాలంటూ టోకరా వేస్తున్నారు. మరికొందరిని ఏసీబీ విచారణ నుంచి తప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేశారు.

ఎస్పీ హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి..

జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో జరుగుతున్న మోసాలపై ఎస్పీ నరసింహ దృష్టి సారించారు. ఎవరైనా ఏసీబీ లేదా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అధికారిక విచారణ పేరుతో డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏసీబీ పేరుతో ఉద్యోగులకు టోకరా వేస్తున్న కేటుగాళ్లపై ఫిర్యాదులు అందాయని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు నరసింహ తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, అవసరమైతే పీడీ యాక్ట్ వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us