
ఎల్నీనో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులపై సోమవారం ఉమ్మడి జిల్లాల ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రంలో తాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా మండల స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా కొనసాగుతుందని.. ఎలాంటి పవర్ కట్స్ ఉండవని.. యాజమాన్యాలు టెన్షన్ పడొద్దని ఆయన తెలిపారు.
అలాగే హైదరాబాద్ నగరంలో కొత్త నిర్మాణాల కోసం బోర్లు వేసేందుకు ఎవరికి పర్మిషన్లు ఇవ్వద్దని అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు నగరంలో నీటి వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా నగరంలో నీటి కొరత లేకుండా చూసేందుకు నవంబర్ 1 నుంచి నిర్మాణ పనులకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయబోతున్నట్టు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు ఉన్నతాధికారులు.
మరోవైపు రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, తగిన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించనుండగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభ్యురాలిగా నియమితులయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో కమిటీ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు.
తాగునీటి సరఫరాపై అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అలాగే కరవు పరిస్థితులను అధిగమించేందుకు జల సంరక్షణ చర్యలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుందని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.