బుధవారం నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉన్నందున నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లోనూ చెదురుమదురు కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థల్ని మూసివేశాయి. తెలంగాణలోనూ విద్యాసంస్థల్ని మూసివేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు అన్ని బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ఈ ఆదేశాలు వైద్య కళాశాలలు మినహా అన్నింటికీ వర్తిస్తాయి. గతంలో మాదిరిగానే విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు యధావిధిగా కొనసాగుతాయి.