Telangana: పది రూపాయల చిల్లర కోసం గొడవ.. కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన మహిళ!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘటన వెలుగుచూసింది. చిల్లర విషయంలో చిన్నగా మొదలైన వివాదం చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళా ప్రయాణికురాలు, విధుల్లో ఉన్న మహిళా కండక్టర్‌ను ఆర్టీసీ బస్సులోంచి కిందకు తోసేసింది.

Telangana: పది రూపాయల చిల్లర కోసం గొడవ.. కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన మహిళ!
Woman Pushes Rtc Conductor Out Of Moving Bus In Bhadradri Kothagudem

Edited By:

Updated on: Oct 26, 2026 | 8:19 AM

చిల్లర విషయంలో మొదలైన చిన్న గొడవ కారణంగా ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సులో ప్రయాణిస్తున్న మౌనిక, కండక్టర్ ప్రవల్లికల మధ్య చిల్లర విషయంలో వివాదం తలెత్తింది. మౌనిక తన కుమారుడి టికెట్ కోసం రూ. 100 ఇవ్వగా, కండక్టర్ రూ. 10 టికెట్ ఇచ్చి మిగతా చిల్లర కాసేపటి తర్వాత ఇస్తానని చెప్పింది.

అయితే ఇందుకు మౌనిక ఒప్పుకోకుండా వెంటనే చిల్లర ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇద్దరూ ఒకరినొకరు నెట్టుకోవడంతో, కండక్టర్ ప్రవళిక ప్రమాదవశాత్తూ బస్సులోంచి కిందపడిపోయింది. అంతలోనే బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు 108 అంబులెన్స్ ద్వారా ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో ప్రవళిక రెండు కాళ్లు నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో తన తప్పేమీ లేదని, చిల్లర డబ్బుల విషయంలో కండక్టరే గొడవపడిందని, ఫుట్‌బోర్డు వద్ద నిలబడడం వల్లే ప్రమాదవశాత్తూ జారి పడిపోయిందని ప్రయాణికురాలు మౌనిక చెబుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us