
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ధనియాలపాడు గ్రామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ గ్రామ పంచాయతీ తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాలు, నాటుసారా వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతుండటాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ సనప సావిత్రి, పాలకవర్గంతో కలిసి ఒక కీలక తీర్మానం చేశారు.
మద్యపాన నిషేధానికి ధనియాలపాడు గ్రామం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా పంచాయతీ పాలక మండలి కఠిన చర్యలు చేపట్టింది. గ్రామంలో మద్యం అమ్మినా, సేవించినా వారిపై పిడి (PD) యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని తీర్మానించారు. అంతేకాదు నిబంధనలు అతిక్రమించిన వారికి ప్రభుత్వం నుండి అందే అన్ని రకాల సంక్షేమ పథకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ గ్రామ సర్పంచ్ సనప సావిత్రి నేతృత్వంలోని పంచాయతీ పాలక మండలి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.
యువత మద్యం బారిన పడి చదువులకు దూరమవ్వడం, అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం మరియు కుటుంబ తగాదాలు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఈ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. “మా ఊరి అభివృద్ధి, యువత బంగారు భవిష్యత్తు కోసమే ఈ కఠిన నిర్ణయం. గ్రామస్థులందరూ దీనికి సహకరించాలి.” అని గ్రామ సర్పంచ్ సనప సావిత్రి కోరారు. ఒక చిన్న గ్రామం తీసుకున్న ఈ “మద్యపాన నిషేధ” నిర్ణయం, సామాజిక మార్పుకు నాంది పలుకుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..