పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. పల్లె రాజేశ్వర్‌రెడ్డి పేరు ప్రకటించిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. పల్లె రాజేశ్వర్‌రెడ్డి పేరు ప్రకటించిన సీఎం కేసీఆర్

Updated on: Feb 08, 2021 | 10:42 AM

Graduates mlc TRS candidate : ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని త్వరలోనే నిర్ణయిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు.

వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని షోడశపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యావేత్తగా ఎమ్మెల్సీగా, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా రాణిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ పొందారు. పరిశోధనలో కృషికిగాను డాక్టర్‌ తమహంకర్‌ మెమోరియల్‌ పతకం అందుకొన్నారు. విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా ఎదిగిన ఆయన.. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర సాధనలో చురుకుగా పాల్గొన్న ఆయన తక్కువగా కాలంలోనే సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలోపల్లా రాజేశ్వరెడ్డిపై 20 సెక్షన్ల కింద 11 కేసులు నమోదయ్యాయి.

2015లో వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అడ్‌హాక్‌ కమిటీ కన్వీనర్‌గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనమండలి విప్‌గా పనిచేశారు. నల్లగొండ ఎంపీగా పోటీచేశారు. వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని పల్లె రాజేశ్వరరెడ్డి తెలిపారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి అవకాశమివ్వాలని ఆయన గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు.

ఇదీ చదవండి…. బాగా పనిచేస్తేనే మళ్లీ ఎమ్మెల్యే టికెట్.. పదేళ్ల వరకు నేనే సీఎం.. కార్యవర్గ సమావేశంలో కేసీఆర్