Telangana: అమ్మా నాన్న ఓ బావి.. సినిమా కథ కాదు.. అంతులేని వ్యథ..

భార్యభర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న వారి కుటుంబంపై మృత్యువు పగ బట్టింది. బావి రూపంలో రెండేళ్ల వ్యవధిలో ఇద్దరినీ బలి తీసుకుంది. నీళ్లు తాగేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి భర్త చనిపోగా.. అదే రీతిలో..

Telangana: అమ్మా నాన్న ఓ బావి.. సినిమా కథ కాదు.. అంతులేని వ్యథ..
Well Death
Follow us

|

Updated on: Sep 23, 2022 | 7:58 PM

భార్యభర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న వారి కుటుంబంపై మృత్యువు పగ బట్టింది. బావి రూపంలో రెండేళ్ల వ్యవధిలో ఇద్దరినీ బలి తీసుకుంది. నీళ్లు తాగేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి భర్త చనిపోగా.. అదే రీతిలో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి బావిలో పడి భార్య మృతి చెందింది. అమ్మానాన్నలను కోల్పోవడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఒకే బావిలో పడి భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని మొయినాబాద్ మండలం చాకలిగూడకు చెందిన వినోద భర్త గతంలో బావిలో పడి మృతి చెందాడు. అప్పటి నుంచి పిల్లలలో కలిసి నివాసముంటోంది. వ్యవసాయ పనులు, కూలీ నాలీ చేసుకుని పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో వ్యవసాయ పనులు కోసం పొలానికి వెళ్లింది. నీళ్లు పెట్టేందుకు సమీపంలో ఉన్న బావివద్దకు వెళ్లి.. మోటారు స్విచ్ ఆన్ చేసింది. ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను గమనించలేదు. సాయంత్రం దాటి రాత్రి అవుతున్నా వినోద ఇంటికి రాకపోయేసరికి ఆమె కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఎక్కడికి వెళ్లిందోనని వెదకడం ప్రారంభించారు. తమకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశారు. అయినా వినోద ఆచూకీ దొరకలేదు. ఆమె పొలం వద్దకు వెళ్లిందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన గ్రామస్థులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. అక్కడ ఉన్న వ్యవసాయ బావిలో వినోద మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే బావిలోకి దిగి.. డెడ్ బాడీని బయటకు తీశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్రీనివాస్ రెండేళ్ల క్రితం ఇదే బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఇప్పుడు భార్య కూడా అదే విధంగా మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లీదండ్రులను కోల్పోవడంతో ఆ చిన్నారులు దిక్కు లేని వారయ్యారు. ఏం జరిగిందో తెలియని అమాయక చూపులు స్థానికులను కలచివేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..