ఆర్టీసీ బస్సు(RTC Bus) లో ప్రయాణం – సురక్షితం అనే నినాదాలు బస్సు బోర్డులకే పరిమితమవుతున్నాయి. స్లోగన్స్ రాయడంతో చూపిస్తున్న శ్రద్ధ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో విఫలమవుతున్నారు. వరసగా జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రయాణీకులకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వాటిలో ప్రయాణించాలంటేనే గుండె అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా తెలంగాణలోని కొమురంభీం(Komaram Bhim) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని బూరగూడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. రెబ్బన నుంచి ఆసిఫాబాద్ వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆసిఫాబాద్(Asifabad) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అధికారులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సురక్షితంగా బస్సు లోపలి నుంచి బయటకు తీశారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి