
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో భాగం. ఒక్క నిమిషం ఫోన్ లేకపోయిన ఆగమాగమవుతాం. బ్యాంకింగ్ లావాదేవీలు, ఆఫీస్ వర్క్స్, ఆన్‌లైన్ షాపింగ్ నుండి ఎంటర్‌టైన్‌మెంట్ వరకు ప్రతి ముఖ్యమైన పనికి మనం ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే మనం ఎంతగానో వాడే ఫోన్ అకస్మాత్తుగా స్లో అయినా, హీట్ అయినా లేదా యాప్స్ క్రాష్ అయినా విపరీతమైన చికాకు వస్తుంది. చాలా మంది తమ ఫోన్లను కొన్నప్పటి నుండి నెలల తరబడి అస్సలు ఆఫ్ చేయరు లేదా రీస్టార్ట్ చేయరు. కానీ క్రమం తప్పకుండా ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా మారుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అసలు రోజుకు ఒక్కసారి ఫోన్ రీస్టార్ట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మనం ఫోన్‌ను నిరంతరం వాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్నో యాప్‌లు, ప్రాసెస్‌లు రన్ అవుతూనే ఉంటాయి. మనం కొన్ని యాప్స్ క్లోజ్ చేసినా కూడా అవి మెమరీని వాడుకుంటూనే ఉంటాయి. దీనివల్ల ఫోన్ RAMపై భారం పడి ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తామో, అప్పుడు ఈ తాత్కాలిక ప్రాసెస్‌లన్నీ పూర్తిగా క్లోజ్ అయిపోతాయి. RAM క్లియర్ అయి సిస్టమ్ సరికొత్తగా రీఫ్రెష్ అవుతుంది. అందుకే రీస్టార్ట్ చేసిన వెంటనే ఫోన్ చాలా స్మూత్‌గా, వేగంగా పనిచేస్తుంది.
మనకు తెలియకుండానే కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ బ్యాటరీ చార్జింగ్‌ను విపరీతంగా వాడేస్తుంటాయి. ఒకవేళ మీ ఫోన్ చార్జింగ్ అకస్మాత్తుగా వేగంగా అయిపోతుంటే.. ఒక్కసారి రీస్టార్ట్ చేసి చూడండి. రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాటరీని దొంగచాటుగా వాడుకునే ఆ అదృశ్య యాప్స్ అన్నీ ఆగిపోతాయి. దీనివల్ల బ్యాటరీ వినియోగం నార్మల్ స్థితికి వచ్చి, బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
కొన్నిసార్లు ఫోన్‌లో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు లేదా మొబైల్ డేటా ఆన్‌లో ఉన్నా ఇంటర్నెట్ అస్సలు స్పీడ్ రాదు. ఇలాంటి సమయాల్లో వెంటనే చాలా మంది సిమ్ కార్డ్ మార్చడానికో లేదా సెట్టింగ్స్ మార్చడానికో కంగారు పడిపోతారు. కానీ సింపుల్‌గా ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే.. నెట్‌వర్క్ మాడ్యూల్ రీ కనెక్ట్ అవుతుంది. దీనివల్ల కాల్ డ్రాప్స్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, చిన్నపాటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ చిటికెలో సర్దుకుంటాయి.
ఫోన్‌ను సుదీర్ఘకాలం పాటు రీస్టార్ట్ చేయకుండా వాడటం వల్ల సిస్టమ్‌లో కాష్ ఫైల్స్, తాత్కాలిక డేటా ఎక్కువగా పేరుకుపోతాయి. దీనివల్ల యాప్స్ ఓపెన్ చేసిన వెంటనే క్లోజ్ అవ్వడం లేదా స్క్రీన్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. రీస్టార్ట్ ప్రక్రియ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను క్లీన్ చేసి, ఇలాంటి చిన్నపాటి సాంకేతిక లోపాలను దానంతట అదే ఫిక్స్ చేస్తుంది.
స్మార్ట్‌ఫోన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్‌ను రోజుకు ఒకసారి లేదా కనీసం వారానికి రెండు నుండి మూడు సార్లు రీస్టార్ట్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా గేమింగ్, వీడియో ఎడిటింగ్, హెవీ మల్టీటాస్కింగ్ చేసేవారికి ఇది ఎంతో అవసరం. రాత్రి పడుకునే ముందు ఫోన్ రీస్టార్ట్ చేయడం ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో సెట్టింగ్స్‌లోకి వెళ్లి Auto-Restart ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. మనం టచ్ చేయకపోయినా ఫోన్ దానంతట అదే రీస్టార్ట్ అవుతుంది.