Tata Nexon EVకు పోటీగా కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఆశ్చర్యపరిచే రేంజ్‌, ఫీచర్లతో VF5!

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వియత్నాంకు చెందిన ప్రముఖ EV తయారీ సంస్థ VinFast మరో కొత్త ఎలక్ట్రిక్ SUVని భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే VinFast VF5. ఈ కారు భారత్‌లో విడుదలైతే కంపెనీ విక్రయించే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల ఈ మోడల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించారు. కొత్త డిజైన్, పెద్ద బ్యాటరీ, ఆధునిక ఫీచర్లతో ఈ SUV ఆకట్టుకుంటోంది.

Tata Nexon EVకు పోటీగా కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఆశ్చర్యపరిచే రేంజ్‌, ఫీచర్లతో VF5!
Vinfast Vf5

Updated on: Nov 26, 2026 | 7:15 AM

ప్రస్తుతం భారత మార్కెట్లో VinFast VF6, VF7, VF MPV 7, Limo Green వంటి నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 2026 జనవరి 1 నుంచి నవంబర్ 9 వరకు 15,867 యూనిట్లను విక్రయించి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో నాలుగో స్థానంలో నిలిచినట్లు సమాచారం. అమ్మకాలను మరింత పెంచుకునే లక్ష్యంతో VF5ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే భారత మార్కెట్‌లో ఈ SUV విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

కొత్త డిజైన్‌తో VinFast VF5..

2026 VinFast VF5 ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా పలు మార్పులు చేశారు. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త కారు 20 మి.మీ పొడవు, 49 మి.మీ వెడల్పు, 16 మి.మీ ఎత్తు పెరిగింది. దీని పొడవు 3,987 మి.మీ, వెడల్పు 1,772 మి.మీ, ఎత్తు 1,595 మి.మీగా ఉంది. ముందు భాగంలో సన్నని ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంపులు, కొత్త బంపర్, క్రోమ్ ఎలిమెంట్స్ అందించారు. వెనుకవైపు కనెక్టెడ్ LED లైట్ బార్, కొత్త టెయిల్ లైట్లు, స్పోర్టియర్ బంపర్ ఉన్నాయి. కొత్త 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

క్యాబిన్‌లో పాత 8 అంగుళాల టచ్‌స్క్రీన్ స్థానంలో 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఇచ్చారు. కొత్త డ్యాష్‌బోర్డ్, రెండు స్పోక్‌ల స్టీరింగ్ వీల్, అదనపు స్టోరేజ్‌తో కూడిన సెంటర్ కన్సోల్ అందించారు. బ్లాక్, క్రీమ్ కలర్ లెదరెట్ సీట్లు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.

43kWh బ్యాటరీ..

VinFast VF5లో 43kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 99bhp పవర్, 135Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఛార్జింగ్ కోసం 6.6kW AC, 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి.

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించారు. భారత మార్కెట్లోకి వస్తే Tata Nexon EV, Kia Syros EV, Mahindra XUV 3XO EV వంటి మోడళ్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే VF5 భారత ధర, విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us