370 కిలోమీటర్ల రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ కారు.. కంపెనీ పేరు, ఫీచర్లు, ధర, లాంచ్​ పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ రేంజ్‌ ఇచ్చే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ VinFast తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు VF5కు కొత్త రూపునిచ్చింది. VF5 Facelift పేరుతో ఈ మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త డిజైన్‌, ఆధునిక ఇంటీరియర్‌, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారును అప్‌డేట్ చేసింది. ఇప్పటికే భారత్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించడంతో దేశీయ మార్కెట్లో కూడా త్వరలోనే అడుగుపెట్టే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.1

370 కిలోమీటర్ల రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ కారు.. కంపెనీ పేరు, ఫీచర్లు, ధర, లాంచ్​ పూర్తి వివరాలు
Vinfast Vf5 Facelift

Updated on: Nov 19, 2026 | 9:10 PM

కొత్త VF5లో కంపెనీ ప్రధానంగా డిజైన్‌, బ్యాటరీ సామర్థ్యం, టెక్నాలజీపై దృష్టి పెట్టింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుందని వెల్లడించింది. SUV తరహా బాక్సీ డిజైన్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌ వంటి ఫీచర్లు ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత మార్కెట్లో విడుదలైతే Tata Nexon EV వంటి ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. అయితే ధర, విడుదల తేదీపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

SUV తరహా డిజైన్‌..

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త VinFast VF5 పరిమాణం పెరిగింది. దీని పొడవు 3,987 మి.మీ, వెడల్పు 1,772 మి.మీ, ఎత్తు 1,595 మి.మీగా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే పొడవు 20 మి.మీ, వెడల్పు 49 మి.మీ, ఎత్తు 16 మి.మీ పెరిగాయి. వీల్‌బేస్ మాత్రం 2,514 మి.మీ వద్ద మారలేదు. ముందు భాగంలో క్రోమ్ డిజైన్‌, బంపర్‌పై అమర్చిన హెడ్‌ల్యాంప్స్‌, నిలువు ఎయిర్ ఇన్‌టేక్‌లు కొత్త రూపును తీసుకొచ్చాయి. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌, బాడీ క్లాడింగ్‌, వెనుక పూర్తి వెడల్పుతో ఉండే LED లైట్ బార్‌, పెద్ద రూఫ్ స్పాయిలర్‌ కూడా ఉన్నాయి.

ఇంటీరియర్‌లో 8 అంగుళాల స్థానంలో 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను అందించారు. కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌, కప్‌హోల్డర్లు, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్‌, డ్యూయల్ టోన్ లెదరెట్ సీట్లు ఉన్నాయి. ప్రత్యేక డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను తొలగించి, స్పీడ్‌తో పాటు కీలక డ్రైవింగ్ సమాచారాన్ని ప్రధాన టచ్‌స్క్రీన్‌పైనే చూపించేలా ఏర్పాటు చేశారు.

43kWh బ్యాటరీ..

కొత్త VF5లో 43kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. పాత మోడల్‌లో ఉన్న 29.6kWh, 37.23kWh బ్యాటరీలతో పోలిస్తే ఇది పెద్ద అప్‌డేట్‌. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 99hp పవర్‌, 135Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.6kW AC ఛార్జింగ్‌తో పాటు 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఉంది. అయితే పూర్తి ఛార్జింగ్‌కు పట్టే సమయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఇప్పటికే భారత్‌లో పరీక్షల సమయంలో కనిపించిన ఈ కారు త్వరలో దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విడుదలైతే VinFastకు ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది. ధర, లాంచ్ తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us