
భారత్‌లో Tata Punch ధరలు సుమారు రూ.5.74 లక్షల నుంచి రూ.10.76 లక్షల వరకు ఉన్నాయి. దీంతో పోలిస్తే దక్షిణాఫ్రికా మార్కెట్లో ఈ SUV ధరలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే రెండు దేశాల ధరలను నేరుగా పోల్చేటప్పుడు ఎగుమతి ఖర్చులు, స్థానిక పన్నులు, మార్కెట్ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. డిజైన్, ఫీచర్ల విషయంలో భారత మోడల్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ, ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లలో మాత్రం కొన్ని మార్పులు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలో Tata Punchను Pure+, Adventure, Accomplished+ అనే మూడు వేరియంట్లలో విడుదల చేశారు. వీటిలో Pure+ 1.2P 5MT ధర 224,900 రాండ్లు (సుమారు రూ.12.82 లక్షలు)గా ఉంది. Adventure 1.2P 5MT ధర 244,900 రాండ్లు (సుమారు రూ.13.96 లక్షలు) కాగా, టాప్ వేరియంట్ Accomplished+ 1.2T 6MT ధర 269,900 రాండ్లుగా (సుమారు రూ.15.36 లక్షలు) నిర్ణయించారు.
ఇంజిన్ విషయానికి వస్తే, 1.2 లీటర్ మూడు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 88hp పవర్, 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. మరోవైపు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120hp పవర్, 170Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. అక్కడి వెర్షన్‌లో పెట్రోల్ AMT, CNG ఆప్షన్లు అందుబాటులో లేవు. భారత్‌లో మాత్రం ఈ ఆప్షన్లు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలో విడుదలైన Tata Punch డిజైన్ దాదాపు భారత మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో LED హెడ్‌లైట్లు, DRLs, కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ అందించారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అందించారు. వారంటీ విషయంలోనూ దక్షిణాఫ్రికా మోడల్‌కు ఎక్కువ కవరేజ్ లభిస్తోంది. అక్కడ 5 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. భారత వెర్షన్‌కు మాత్రం 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు.