
అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెందిన సుమారు నాలుగు టన్నుల బరువున్న రెండో దశ బుధవారం తెల్లవారుజామున చంద్రుడి పశ్చిమ అంచున ఉన్న ఐన్‌స్టీన్ బిలం సమీపంలో గంటకు సుమారు 5,400 మైళ్ల వేగంతో ఢీకొట్టింది. ఈ రాకెట్ భాగాన్ని 2025 జనవరిలో ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ రూపొందించిన లూనార్ ల్యాండర్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ఉపయోగించారు. ఈ ఢీకొనడం ముందుగా ప్రణాళిక వేసింది కాదని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది.
ఈ ఘటనను భూమిపై ఉన్న టెలిస్కోపులు విజయవంతంగా పరిశీలించాయి. ముఖ్యంగా చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ESO)కు చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్, ఢీకొట్టిన వెంటనే చంద్రుడి ఉపరితలం నుంచి వెలువడిన స్వల్ప కాంతి, రసాయన సంకేతాలను గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే శాస్త్రవేత్తల ప్రకారం.. తాకిడి తర్వాత పైకి ఎగిసిన ధూళి మేఘంలో సోడియం, లిథియం వాయువుల ఆనవాళ్లు నమోదయ్యాయి. ఈ రసాయన సంకేతాలు ఐదు నుంచి పది నిమిషాల పాటు మాత్రమే కనిపించాయి.
— Elon Musk (@elonmusk) August 6, 2026
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. గుర్తించిన సోడియం చంద్రుడి నేల నుంచే వచ్చిన అవకాశం ఉంది. అయితే లిథియం మాత్రం రాకెట్‌లోని బ్యాటరీలు లేదా ఇతర భాగాల నుంచి వచ్చి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ వివరాలపై మరింత లోతైన విశ్లేషణ కొనసాగుతోంది. సాధారణంగా ప్రయోగాలు పూర్తైన తర్వాత రాకెట్ దశలు భూమి వాతావరణంలోకి తిరిగి వచ్చి కాలిపోతాయి. కానీ చంద్రుడి దిశగా ప్రయాణించే మిషన్లలో ఉపయోగించే కొన్ని రాకెట్ భాగాలు అంతరిక్షంలోనే మిగిలిపోతుంటాయి. సూర్యుడి ప్రభావం, గురుత్వాకర్షణ శక్తుల కారణంగా ఈ రాకెట్ భాగం క్రమంగా తన కక్ష్యను మార్చుకుంటూ చివరకు చంద్రుడిని ఢీకొట్టిందని స్పేస్‌ఎక్స్ తెలిపింది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి