
భారతదేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర’ (Sudarshan Chakra Project) కోసం రష్యా ఒక అసాధారణమైన ప్రతిపాదనను భారత్ ముందు ఉంచింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థగా పేరొందిన ‘ఎస్-500’ ఆధారిత సాంకేతికతను భారతదేశంతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్లు రష్యా వర్గాలను ఉటంకిస్తూ ‘ఐడిఆర్‌డబ్ల్యూ’ (IDRW) పేర్కొంది.
నిజానికి ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతర్గత భద్రతా అవసరాల దృష్ట్యా, గతంలో ఎస్-500 వ్యవస్థను నేరుగా భారతదేశానికి విక్రయించడానికి రష్యా నిరాకరించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, నేరుగా విక్రయించే బదులు.. ఎస్-500 సామర్థ్యాలను భారతదేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి మొగ్గు చూపింది. రష్యా నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన భారతదేశపు ప్రస్తుత, భవిష్యత్ బహుళ అంచెల వాయు రక్షణ నిర్మాణాన్ని మరింత శక్తివంతం చేయనుంది.
ఏమిటీ సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్?
భారతదేశం తన సొంత గగనతల రక్షణ అవసరాల కోసం ‘ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర’ను అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం ఒక క్షిపణి వ్యవస్థ మాత్రమే కాదు; సుదూర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు (LR-SAM), బాలిస్టిక్ క్షిపణి రక్షణ (BMD) వ్యవస్థలు, నిఘా సెన్సార్లు, అత్యాధునిక రాడార్లు, కమాండ్-అండ్-کంట్రోల్ నెట్‌వర్క్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఒక సమీకృత నెట్‌వర్క్. ఇది ఇప్పటికే భారత్ వద్ద ఉన్న రష్యన్ ఎస్-400 వ్యవస్థతో పాటు, స్వదేశీ వాయు రక్షణ ప్రాజెక్ట్ ‘కుషా’ (Project Kusha) లతో కలిసి సమన్వయంతో పనిచేస్తుంది.
తిరుగులేని భారత్ శక్తి
రష్యాకు చెందిన ఎస్-400 కంటే ఎస్-500 ఎంతో అధునాతనమైనది. ఈ సాంకేతికత తోడైతే, భారత రక్షణ వ్యవస్థ శత్రుదేశాల విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, అత్యంత వేగంగా దూసుకొచ్చే హైపర్‌సోనిక్ ఆయుధాలను సైతం గాల్లోనే తుత్తునియలు చేయగలదు. అంతేకాకుండా, మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్టెల్త్ ఫైటర్ జెట్‌లను కూడా ఇది గుర్తించి కూల్చివేయగలదు.
వ్యూహాత్మక ప్రాధాన్యత – టెక్నాలజీ బదిలీ
బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటికే స్వంత మార్గసూచితో బాలిస్టిక్ క్షిపణి రక్షణ ఫేజ్-I ను మోహరించింది. ఇది అంతరిక్షం వెలుపల, వాతావరణం లోపల వచ్చే క్షిపణులను అడ్డుకుంటుంది. ఇలాంటి తరుణంలో రష్యా ప్రతిపాదన భారత్‌కు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే, ఈ ప్రతిపాదన కేవలం ఆయుధాల కొనుగోలుకు పరిమితం కాకుండా, అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ప్రాధాన్యత ఇస్తుంది.
చిరకాల మైత్రికి నిదర్శనం
ఒకప్పుడు కేవలం ఆయుధాల విక్రయదారుడిగా ఉన్న రష్యా, ఇప్పుడు భారతదేశపు సమీకృత వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా మారడానికి సిద్ధపడటం ఇరు దేశాల చిరకాల మైత్రికి, వ్యూహాత్మక బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే భారత గగనతలం వైపు కన్నెత్తి చూడటానికి కూడా శత్రుదేశాలు వణకక తప్పదు.
Russia is pitching the S-500 to India with possible local production and technology transfer, but there is no confirmed deal, co-development agreement, or public link to Mission Sudarshan Chakra yet.
The S-400 proved its value during Operation Sindoor. The S-500 could add… https://t.co/pL3wKqfyn9
— Alok Sharma (@ThusSpokeDharma) July 13, 2026
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..