Google Maps: ఒకప్పుడు ఏదైనా అడ్రస్ తెలియాలంటే ఎవరినో ఒకరి అడిగి కిందా మీద పడుతూ గమ్యాన్ని చేరుకునే వారు కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు గమ్యాన్ని చేరుకోవడం ఎంతో సులభంగా మారింది. ఇదంతా గూగుల్ మ్యాప్స్ పుణ్యమే. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను పరిచయం చేసే గూగుల్ తాజాగా మ్యాప్స్‌లో మరో ఆసక్తికర ఫీచర్‌ను యాడ్ చేసింది. వాహనంలో దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో మధ్యలో టోల్‌గేట్లు వస్తుంటాయి. అయితే టోల్ గేట్‌ల వద్ద ఎంత ఛార్జీ వసూలు చేస్తారన్న విషయం మనకు అక్కడికి వెళ్లే వరకు తెలియదు.
అలా కాకుండా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడే మనం వెళ్లే దారిలో మొత్తం ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి. ఎంత మొత్తం అవుతుంది.? లాంటి విషయాలు తెలిస్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అచ్చంగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే గూగుల్ మ్యాప్స్‌లో ఓ ఫీచర్‌ను అందించారు. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఇండోనేసియా దేశాల్లోని సుమారు 2వేల టోల్ రోడ్ల ఛార్జీల వివరాలను మ్యాప్‌లో చూపిస్తాయి.
దీంతో ముందుగానే టోల్ ఛార్జీల లెక్క తేల్చుకోవచ్చు. అలాగే టోల్ గేట్స్‌ను తప్పించుకునే మార్గాలు ఉంటే కూడా గూగుల్ మనకు చూపిస్తుంది. ఇక టోల్ గేట్స్ లేని రోడ్ల ద్వారా ప్రయాణం చేయాలనుకునే వారు ‘అవాయిడ్ టోల్స్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..