
ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్ అనేవి నిత్యావసర వస్తువుగా మారిపోయాయని చెప్పవచ్చు. ఆఫీస్ వర్క్, బిజినెస్ పనుల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రిమోట్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ ఇటీవల పెరిగిపోతున్న క్రమంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. ఇక వీటిని వాడాలంటే కీబోర్డ్ అనేది అవసరం. కీబోర్డ్ లేకుండా మీరు టైప్ చేయలేరు. మీరు ఎప్పుడైనా కీబోర్డును పరిశీలిస్తే అందులో F,J ఆక్షరాల కింద ఉచ్చెత్తుగా ఒక చిన్న గీత ఉంటుంది. కేవలం ఆ రెండు అక్షరాల కింద మాత్రమే ఈ గీతలు ఉంటాయి. మిగతా కీస్‌పై అవి ఉండవు. అయితే వీటి వల్ల ఉపయోగాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కీబోర్డులో F,J కీస్ కింద ఉబ్బెత్తుగా చిన్న గీతలు ఉంటాయి. ఏదో యాదృచ్చికంగా వీటిని పెట్టలేదు. ఈ గీతల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కంప్యూటర్ వైపు చూసి కీబోర్డ్ టైప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కీస్‌ను గుర్తించేందుకు, వేళ్లను సరైన స్థానంలో ఉంచడానికి ఈ గీతలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. వేళ్లతో తాకినప్పుడు స్పష్టంగా తెలిసేందుకు వీటిని రూపొందించారు. కీబోర్డు వైపు చూడకుండానే చేతులు సరైన స్థానంలో ఉన్నాయా.. లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ వేళ్లు వేరే కీస్‌వైపు జరిగినప్పుడు F,J కీస్‌ను తాకినప్పుడు వేళ్ల పొజిషన్ మార్చుకోవచ్చు. టైపింగ్ స్పీడ్‌గా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ రెండు ఆక్షరాలపై మాత్రమే గీతలు ఉంచడానికి మరో కారణం ఉంది. టైప్ చేసేటప్పుడు ఎడమ చేతి చూపుడు వేలు F కీపై, కుడి చేతు చూపుడు వేలు Jపై ఉంచుతాం. రెండు చేతులకు మధ్యలో ఉండే రిఫరెన్స్ పాయింట్లు ఈ రెండు కీస్ పనిచేస్తాయని చెప్పవచ్చు.
కీబోర్డ్ చూడకుండా వేగవంతంతగా టైప్ చూసేందుకు ఈ కీస్ ఉపయోగపడతాయి. స్పీడ్‌గా టైప్ చేసేవారు కీబోర్డ్ వైపు కాకుండా స్క్రీన్ వైపు చూసి చేస్తారు. దీంతో చేతులు పక్కకు వెళ్లినా సరిచేసుకోవడానికి ఈ గీతలు సహాయపడతాయి. అలాగే కొత్త టైపింగ్ నేర్చుకునేవారికి ప్రతీ కీని గుర్తించడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో F,J కీస్‌లపై ఉండే గీతల ద్వారా వేళ్లను సరైన స్థానంలో అమర్చుకోవచ్చు. మీరు ఈ రెండు కీస్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకుని టైపింగ్ చేస్తే వేగవంతంగా చేయవచ్చు. మీ టైపింగ్ స్పీడ్ కూడా మెరుగుపడుతుంది. చాలామంది కీబోర్డులో దీనిని అసలు గమనించి ఉండరు. ఒకవేళ గుర్తించినా దాని వల్ల లాభాలేంటి అనేది తెలియదు.