భానుడిపై ఏర్పడిన రెండు భారీ విస్ఫోటాలు.. అంతరిక్షంలోకి వెదజల్లుతున్న ప్రచండ రేణువులు.. భూమికి పొంచి ఉన్న ముప్పు..?

|

Jan 07, 2021 | 4:49 PM

సూర్యుడి దక్షిణార్ధ గోళంలో అయస్కాంత క్షేత్ర వైరుధ్యాల కారణంగా ఈ పేలుళ్లు సంభవించాయని, ఫలితంగా ప్రచండ రేణువులు అంతరిక్షంలోకి వెదజల్లాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భానుడిపై ఏర్పడిన రెండు భారీ విస్ఫోటాలు.. అంతరిక్షంలోకి వెదజల్లుతున్న ప్రచండ రేణువులు.. భూమికి పొంచి ఉన్న ముప్పు..?
Follow us on

మనం భూగ్రహంపై పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు ప్రాణకోటికి ఎంత ప్రాణాంతకంగా మారాయో.. ఇప్పుడు అంతరిక్షంలోనూ వ్యర్థాలు అంతే ప్రాణాంతకంగా మారాయంట.. ఇదే క్రమంలో భగభగ మండే భానుడిపై ఈ నెల 2న రెండు భారీ విస్ఫోటాలు సంభవించాయి. సూర్యుడి దక్షిణార్ధ గోళంలో అయస్కాంత క్షేత్ర వైరుధ్యాల కారణంగా ఈ పేలుళ్లు సంభవించాయని, ఫలితంగా ప్రచండ రేణువులు అంతరిక్షంలోకి వెదజల్లాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భగభగ మండే ఈ రేణువులు భూమిని తాకే ప్రమాదం లేకపోలేదని సైంటిస్టులు అంచనావేస్తున్నారు.

ఈ రెండు భారీ విస్ఫోటాల కారణంగా కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌-సీఎంఈ అనే పెను తుపాన్లు ఏర్పడ్డాయని, ఇవి భూమివైపు దూసుకొస్తున్నట్టు స్పేస్‌వెదర్‌డాట్‌కామ్‌ వెల్లడించింది. మొదటి సీఎంఈ నిదానంగా కదులుతున్నదని, రెండోది వేగంగా ప్రయాణిస్తున్నట్టు వివరించింది. వాటి విస్ఫోటం, వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రెండు ఒక్కటై భారీ సీఎంఈ ఏర్పడే అవకాశం ఉన్నదని వివరించింది. అది భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌వోఏఏ) అంచనా వేసింది.

సూర్యుడిలో భారీ విస్ఫోటం జరిగినప్పుడు కోట్ల అణుబాంబులు పేలితే వెలువడే శక్తి కంటే అధిక శక్తి వెలువడి, అది సౌర జ్వాలల రూపంలోనూ లేదా ఆవేశం కల ప్లాస్మా పుంజాల రూపంలో అత్యధిక వేగంతో అంతరిక్షంలోకి ప్రయాణిస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది భూ వాతావరణాన్ని తాకినప్పుడు వర్ణరంజితమైన అరోరాలు ఏర్పడుతాయని భావిస్తున్నారు. ఇవి శ్రుతిమించితే విద్యుత్‌ గ్రిడ్లు, సముద్రంలోని పైప్‌లైన్లు ధ్వంసమయ్యే ప్రమాదంలేకపోలేదని చెబుతున్నారు. అలాగే కృత్రిమ ఉపగ్రహాలకూ సైతం నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు.