చర్మ వ్యాధులు వ్యక్తులను ఇబ్బందుల పాల్జేస్తాయి. సమాజంలో ఫ్రీగా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి. ఇక శరీర అంతరభాగాలలో వస్తే కనీసం డాక్టర్ కూడా చూపించలేక అవస్థలు పడేవారు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి వాటిని సులభంగా గుర్తించడానికి ఓ అద్భుతమైన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదే గూగుల్ లెన్స్. దీంతో మెడికల్ చెకప్ ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి.
అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత మనిషికి అనేక సౌలభ్యాలను తెచ్చిపెడుతోంది. అరచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్ ఫోన్ సాయంతో అన్ని సమకూరుతున్నాయి. అందులోని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎంతలా ప్రయోజనం చేకూరుస్తుందో అందరికీ తెలిసిందే. అయితే గూగుల్‌లోని మరో ఫీచర్ గూగుల్ లెన్స్. ఇది సాధారణ చిత్రాలను నెట్‌లో సెర్చ్ చేయడానికి ఉపకరిస్తుంది. మనం ఏదైనా ఫోటోలో గూగుల్ లెన్స్ లో అప్ లోడ్ చేస్తే అది దానికి సంబంధించిన ఇతర చిత్రాలతో పాటు దానికి సంబంధించిన వివరాలను మనకు చూపిస్తుంది. ఉదాహరణకు మీకు ఏదైనా ఒక వస్తువు నచ్చిందనుకోండి.. దానిని ఫొటో తీసి గూగుల్ లెన్స్‌లో అప్ లోడ్ చేస్తే చాలు. దాని పుట్టుపూర్వోత్తరాలు బయటకు తీస్తుంది. అది ఎక్కడ దొరకుతుంది? దాని ధర ఎంత? దానికి సంబంధించిన ఇతర మోడళ్లు ఏమున్నాయి వంటి వన్నీ చూపిస్తుంది. ఇప్పుడు దీనిని చర్మవ్యాధులను గుర్తించడానికి కూడా ఉపయోగించవచ్చని గూగుల్ ప్రకటించింది.
గూగుల్ లెన్స్ ద్వారా ఇప్పుడు మీ శరీరంపై ఉన్న మచ్చలు, ర్యాష్‌లు, మొటిమల వంటి వాటి గురించి గూగుల్ లెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటి చిత్రాలను గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేస్తే దాని పరిస్థితి ఏంటి అనేది చెప్పేస్తుంది. సాధారణంగా చర్మంపై దద్దర్లు, మచ్చలు ఎలా వచ్చాయి అనేది చెప్పడం కష్టమే. శరీరంపై ఏ భాగంలో ఎలాంటి మచ్చలు, మొటిమకలు, ర్యాష్‌లు, వాపు ఉన్నా వాటి గురించి తెలుసుకోవచ్చు.
గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి స్కిన్ పరిస్థితులను ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు చూద్దాం.. మొదటిగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను తెరిచి.. సెర్చ్ బార్‌కు ఎడమవైపున ఉన్న లెన్స్ ఫీచర్ (రంగు రంగుల కెమెరా చిహ్నం)పై నొక్కండి. కెమెరా తెరిచిన తర్వాత, ఆన్-స్క్రీన్ షట్టర్ బటన్‌ను నొక్కండి. మీరు తక్షణ ఫలితాలను పొందుతారు.అనేక చిత్రాలను సరిపోల్చడం ద్వారా మరింత పరిశోధన చేయాలి. అయితే చర్మ పరిస్థితికి మందులను నిర్ణయించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని మాత్రం గుర్తుంచుకోండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..